
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు.