సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనమే కాదు, అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుంది. ఈ కారణంగా ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే.
ఈ ఉల్లంఘనకు 1955లో తీసుకొచ్చిన ‘అంటరానితనం నిషేధ చట్టం’ కింద నేరస్థులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలోకి అదే మతానికి చెందిన కొంత మందిని అనుమతించడం, మరికొంత మందిని అనుమతించక పోవడం అంటరానితనమే అవుతుందంటున్న రాజ్యాంగంలోని 17వ అధికరణను స్ఫూర్తిగా తీసుకొనే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచీ గత సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని అన్ని రకాల అంటరానితనాలను నిషేధించినట్లు రాజ్యాంగంలోని 17వ షెడ్యూల్ స్పష్టం చేసింది. ఎలాంటి సామాజిక కారణాల వల్ల కూడా ఎవరి పట్ల వివక్షత చూపినా అది అంటరానితనమే అవుతుందని కూడా చెప్పింది. అందుకనే ఇది స్వచ్ఛం, అది అపవిత్రం అంటూ మహిళల పట్ట వివక్షత చూపడం కూడా అంటరానితనమే అవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇద్దరు మహిళ అయ్యప్పను సందర్శించుకోవడం వాస్తవమేనంటూ ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. అపచారమంటూ శుద్ధి చర్యలు తీసుకున్న పూజారులపై కేసు పెట్టగలరా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు శుద్ధి పూజల పేరిట శబరిమల ఆలయాన్ని మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
Published Wed, Jan 2 2019 4:50 PM | Last Updated on Wed, Jan 2 2019 5:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment