travancore devaswom board
-
Travancore Devaswom Board: శబరిమలలో భారీ రద్దీ.. దర్శన సమయం గంట పెంపు
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, 30 వేల స్పాట్లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. -
నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయం నేడు తెరచుకోనుంది. తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరవనున్నామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో కారు బీభత్సం.. నలుగురు మృతి) -
లాక్డౌన్ : ఆ దేవాలయ నష్టం 200 కోట్లు
తిరువనంతపురం : లాక్‌డౌక్ కారణంగా దేశంలోని దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి. దీంతో ఆలయాలకు వచ్చే పెద్ద ఎత్తున విరాళాలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కేరళలోని దేవస్థానాల్లో పూజలు నిలిపివేశారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న దేవాలయాలు మూసివేయడం మూలంగా రూ. 200 కోట్లకుపైగా నష్టపోయామని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. దీంతో దేవాలయాల పరిధిలో ఉన్న బంగారాన్ని, విరాళాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వడ్డీ తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోర్డు తాజా నిర్ణయంపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ట్రావెన్కోర్ దేవస్థానం వారంలోపల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. (టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం) -
శబరిమలలో భద్రత కట్టుదిట్టం
శబరిమల: సంక్రాంతి సందర్భంగా బుధవారం జరిగే మకరవిలక్కు ఉత్సవాలకు శబరిమల అయ్యప్ప ఆలయం సంసిద్ధమైంది. ఆలయ పరిసరాలన్నింటినీ కట్టుదిట్టమైన రక్షణ వలయంలోకి తీసుకొచ్చారు. భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మండల దీక్షల తరువాత సంక్రాంతి రోజున అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరిగే విషయం తెలిసిందే. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిన భద్రత కోసం వినియోగిస్తున్నామని ఆలయ నిర్వాహకులైన ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు మంగళవారం తెలిపింది. అయ్యప్ప తన బాల్యాన్ని గడిపినట్లు చెప్పే పండలం నుంచి ఆలయానికి విచ్చేసే నగల పెట్టె ‘తిరువాభరణం’తో విచ్చేసే ఊరేగింపునకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం స్వాగతం పలుకుతుందని బోర్డు తెలిపింది. మకరవిలక్కు దీపారాధనను దర్శించేం దుకు వేలాదిగా హాజరవుతారని అంచనా. ఉత్సవాల అనంతరం ఈ నెల 21వ తేదీన ఆలయం మూతపడనుందని అధికారులు తెలిపారు. -
బంగారం మాయం; తెరచుకోనున్న స్ట్రాంగ్‌రూంలు
తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామి ఆలయ బంగారం వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం స్ట్రాంగ్ రూంలు తెరుచుకోనున్నాయి. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారుల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి ఆడిట్ జరుగనుంది. కాగా స్ట్రాంగ్ రూముల్లోని స్వామి వారి బంగారం మాయమైదంటూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విజలెన్స్ వింగ్‌కు ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా స్ట్రాంగ్ రూముల్లో బంగారం భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో బంగారం విషయమై దర్యాప్తు జరపాల్సిందిగా బీజేపీ నేతృత్వంలో హిందూ సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈ వ్యవహారంపై విచారణకు కేరళ హైకోర్టు ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సోమవారం ఆడిట్ జరుగునుంది. ఇక ఈ విషయంపై స్పందించిన బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ బంగారం మాయమైందన్న విషయాన్ని కొట్టిపారేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు పాత కమిటీ బంగారానికి సంబంధించిన వివరాలు అందించలేదని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతుందని.. ఒకవేళ ఆడిట్లో గనుక తేడాలు వచ్చినట్లైతే బాధ్యులపై బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. -
‘ట్రావెన్కోర్’ యూటర్న్
-
ట్రావెన్కోర్ బోర్డు యూటర్న్
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుస్రావ వయసున్న (18 నుంచి 50 ఏళ్లలోపు) మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బుధవారం అనూహ్యంగా మనసు మార్చుకుంది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ మహిళల ప్రవేశంపై గతేడాది ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు బోర్డు తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టుకు తెలిపారు. జీవసంబంధమైన లక్షణాల ఆధారంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అన్నిపక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ బోర్డు గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించగా, నాయర్ సర్వీస్ సొసైటీ, ఆలయ తంత్రి తదితరులు తీర్పును సమీక్షించాలని కోరారు. మతపరమైన సంస్థలకు వర్తించదు.. మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ(ఎన్ఎస్ఎస్) తరఫున సీనియర్ న్యాయవాది కె.పరశరణ్ వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 దేశంలోని అన్ని లౌకికవాద సంస్థలకు వర్తిస్తుంది. కానీ మతపరమైన సంస్థలకు ఇది వర్తించదు. ఆర్టికల్ 15 నుంచి మతపరమైన సంస్థలకు స్పష్టమైన మినహాయింపు దొరుకుతోంది. అంటరానితనం నిర్మూలనకు ఉద్దేశించిన ఆర్టికల్ 17ను సుప్రీంకోర్టు పొరపాటున తన తీర్పులో ఉదాహరించింది. ఎందుకంటే కొందరు మహిళలకు కులాల ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం లేదు. శబరిమల అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి. ఈ విషయాన్ని తీర్పు సందర్భంగా కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది’ అని తెలిపారు. మరోవైపు అయ్యప్పస్వామి ఆలయంలోకి కులం, మతం ఆధారంగా మహిళలు, పురుషులపై నిషేధం లేదని బోర్డు మాజీ చైర్మన్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. మహిళల్లోని ఓ వర్గాన్ని మాత్రమే నిషేధిస్తున్నందున ఆర్టికల్ 17(అంటరానితనం నిర్మూలన) దీనికి వర్తించదని పేర్కొన్నారు. -
‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు చేపట్టింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్ సర్వీస్ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కే పరాశరన్ విజ్ఞప్తి చేశారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా రుతుక్రమం కలిగిన స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రివ్యూ పిటిషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా కోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్ధమని, సుప్రీం ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించాలని కోరరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు న్యాయవాది రాకేష్ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు. ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అలంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించినదని సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా టీవీల్లో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
శబరిమల పూజారులపై చర్యలుంటాయా!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనమే కాదు, అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుంది. ఈ కారణంగా ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఈ ఉల్లంఘనకు 1955లో తీసుకొచ్చిన ‘అంటరానితనం నిషేధ చట్టం’ కింద నేరస్థులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలోకి అదే మతానికి చెందిన కొంత మందిని అనుమతించడం, మరికొంత మందిని అనుమతించక పోవడం అంటరానితనమే అవుతుందంటున్న రాజ్యాంగంలోని 17వ అధికరణను స్ఫూర్తిగా తీసుకొనే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచీ గత సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రకాల అంటరానితనాలను నిషేధించినట్లు రాజ్యాంగంలోని 17వ షెడ్యూల్ స్పష్టం చేసింది. ఎలాంటి సామాజిక కారణాల వల్ల కూడా ఎవరి పట్ల వివక్షత చూపినా అది అంటరానితనమే అవుతుందని కూడా చెప్పింది. అందుకనే ఇది స్వచ్ఛం, అది అపవిత్రం అంటూ మహిళల పట్ట వివక్షత చూపడం కూడా అంటరానితనమే అవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇద్దరు మహిళ అయ్యప్పను సందర్శించుకోవడం వాస్తవమేనంటూ ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. అపచారమంటూ శుద్ధి చర్యలు తీసుకున్న పూజారులపై కేసు పెట్టగలరా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు శుద్ధి పూజల పేరిట శబరిమల ఆలయాన్ని మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. -
శబరిమల దర్శనానికి 550మంది మహిళలు
తిరువనంతపురం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్రకు ఆన్లైన్లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్ చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. కాగా, శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్ చేసుకున్నట్లు తెలిపింది. గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
నేడు తెరుచుకోనున్న ‘శబరిమల’
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది. నేటి సాయంత్రం 5 గంటలకు.. ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్‌లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు. విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్‌పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. -
అయ్యప్ప భక్తులకోసం కుటుంబశ్రీ మిషన్
సాక్షి, తిరువనంతపురం : నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తుల వస్తుంటారు. వీరిలో 65 శాతం మంది సొంత వాహనాలతో శబరిమలకు రావడం జరుగుతుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు.. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలిపి వంట చేసుకోవడం పరిపాటి. ఇలా రోడ్ల పక్కన వంట చేసుకుని.. ఆపై వాటిని ఆలాగే వదిలివేయడం వల్ల భారీగా కాలుష్యం జరుగుతోంది. దీనిని నివారించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ‘కుటుంబశ్రీ’ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మిషన్కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా.. టీడీబీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తుంది. అందులో విశ్రమించడంతో పాటు.. వంటకు అవసరమైన పాత్రలు, గ్యాస్, నీరు, ఇతర వస్తువులను అందించడం జరుగుతుంది. వంట చేసుకుని భోజనం చేశాక.. కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని టీడీబీ అధికారులు ప్రకటించారు. కుటంబశ్రీ మిషన్ కింద ఇప్పటికే పథినంతిట్ట, నీలక్కల్, శబరిమల ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు టీడీబీ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా.. జనవరి 5 లోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీబీ తెలిపింది. -
టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి జోలపాటగా ప్రఖ్యాతిగాంచిన ‘హరివరాసనం’ అనే అష్టకంలో కొన్ని తప్పులను సరిదిద్దినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మళయాళంలో అష్టకంగా పిలుచుకునే ఈ హరివరసానంలో శ్లోకాల్లో సంస్కృత పదాలు కొన్ని రూపాంతరం చెందడం, అసలుకే లేకపోవడం జరిగిందని.. టీడీబీ పేర్కొంది. వీటిని సరిదిద్ది మళ్లీ కొత్తగా రికార్డ్ చేసిన హరివరాసనం శ్లోకాలనే ఈ ఏడాది స్వామి వారికి జోలపాటగా వినిపిస్తామని బోర్డు తెలిపింది. దేశంలో పలువురు గాయకులు హరివరాసనం శ్లోకాలను ఆలపించినా.. కేజే ఏసుదాస్.. హరివరాసనంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన టీడీపీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్లోకాల్లో అరివిమర్ధనం నిత్యనర్తనం అనే పాదంలో.. అరి విమర్ధనం అంటూ విడిగా ఉచ్ఛరించాలని ఆయన తెలిపారు. అరి అంటే శత్రువని, మర్ధనం అంటే నాశనం చేయడమనే అర్థం వస్తుందని చెప్పారు. ఏసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన రాగానే వీటిని సరిదిద్ది హరివరసానం శ్లోకాలను మళ్లీ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. -
మనసులు గెలిచిన దళిత అర్చకులు
తిరువనంతపురం : దేశ చరిత్రలో తొలిసారి ఆలయాల్లో దళితులను అర్చకులుగా నియమించి సంచలనం ట్రావెన్కోర్ దేవస్థానంబోర్డు (టీడీబీ) సంచలనం సృష్టించింది. శబరిమల ఆలయం సహా కేరళలోని పలు దేవస్థానాల్లో కొత్తగా 62 మందిని అర్చకులుగా నియమించింది. ఇందులో 36 మంది బ్రాహ్మణేతరులుకాగా.. ఆరుగురు దళితులున్నారు. టీడీబీ నమ్మకాలను, భక్తుల విశ్వాసాలను నిలబెడుతూ.. దళిత అర్చకులు కొత్త చరిత్ర సృష్టించారు. ఎర్నాకుళం జిల్లా అర్కెపాడులోని మహదేవాలయంలో అర్చకునిగా నియమించబడ్డ.. 31 ఏళ్ల మనోజ్ (దళిత అర్చకుడు) టీడీబీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భగవంతుడికి.. ఆయన భక్తులకు సేవలు చేయాలన్న నాకలను టీడీబీ నిజం చేసిందని అన్నారు. భక్తులు నన్ను ఎంతో ఆదరంగా చూస్తున్నారని.. నాతో పూజలు చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. ‘నేను చిన్నతనంలో మా గ్రామంలోని ఆలయంలో బ్రాహ్మణ పురోహితునికి సేవలు చేసేవాడిని.. ఆయన నన్ను ఏనాడు కులపట్టింపుతో చూడలేదు.. ఆయన దయవల్లే నేను ఈ రోజు ఈస్థానంలోకి రాగలిగాను’ అని ఆనందంగా చెప్పారు. జన్మతో కులాన్ని చూడకుండా.. గుణాలతో చూడాలని మనోజ్ అన్నారు. మా గ్రామ అర్చకుడి సేవలో గడడం వల్ల నేను ఏనాడు మద్య, మాంసాలు ముట్టుకోలేదని చెప్పారు. సంస్కృతంలో పీజీ చేసిన మరో దళిత అర్చకుడు మదుకృష్ణ కూడా టీడీబీ నిర్ణయంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పథినంతిట్ట జిల్లాలోని కిచ్చీరివల్ శివాలయంలో యదుకృష్ణ అర్చకత్వం వహిస్తున్నారు. యదుకృష్ణ కూడా ఎనిమిదేళ్ల వయసులో గ్రామంలోని శివాలయంలో అర్చకుడికి సహాయకుడిగా విధులు నిర్వహించారు. మా అమ్మకు భక్తి చాలా ఎక్కువ. అందువల్ల నన్ను చిన్నతనం నుంచే ధార్మిక కార్యక్రమాలు, పూజాదికాలు, సంస్కృతంపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు. యదుకృష్ణ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ.. అభిషేకం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవని భక్తులు చెబుతున్నారు. -
కేరళలో పూజారుల పోస్టులకు దళితులు!
తిరువనంతపురం: కేరళలో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహణలోని ఆలయాల్లో 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి సిఫారసు చేశారు. వీరిలో ఆరుగురు దళితులుండటం విశేషం. ఇందుకు సంబంధించి కేరళ దేవస్థానం నియామక బోర్డు సిఫార్సు చేసింది. దళితుల నుంచి ఆరుగురిని పూజారులుగా నియమించడానికి సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకాలు చేపట్టేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో అవినీతికి చోటులేదని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తున్నామని దేవస్థాన మంత్రి కదకంపల్లి రామచంద్రన్ చెప్పారు. -
శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా..
అయ్యప్ప స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, కొన్ని కిలోమీటర్లు కాలి నడకన సన్నిధానానికి చేరుకుంటారు. విపరీతమైన రద్దీ కారణంగా స్వామి వారిని తనివి తీరా చూడలేక.. తృప్తిగా సేవలు చేసుకోలేని పరిస్థితి. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘ట్రావెన్కోర్ దేవసోమ్ బోర్డు’ వారు వివిధ రకాల సేవలను ముందుగానే ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన రోజున వివిధ రకాల పూజలను జరిపించవచ్చు. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఏ తరహా సేవలను ఎలా బుక్ చేసుకోవచ్చు అనే వివరాలు మీ కోసం.. ఆన్లైన్ సేవలను బుక్ చేసుకునే విధానం.. ముందుగా https://www.sabarimalaaccomodation.com/ver1/Poojahome.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ అందుబాటులో ఉన్న పది రకాల సేవలు మీకు కన్పిస్తాయి. ⇒సేవలతోపాటుగా వాటికి చెల్లించాల్సిన మొత్తం అక్కడ కన్పిస్తుంది. ⇒మీకు కావాల్సిన పూజ పక్కనే కనిపిస్తున్న ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ మీకు సెలక్ట్ డేట్ కనిపిస్తుంది. ⇒మీకు నచ్చిన తేదీని ఎంచుకోవాలి. ఆ రోజు ఖాళీగా ఉంటేనే పూజ బుకింగ్ ఆప్షన్ వస్తుంది. ⇒ఇక్కడ మీ పేరు, మీ జన్మ నక్షత్రం నమోదు చేయాలి. ⇒యాడ్ టూ కార్ట్ క్లిక్ చేస్తే కార్ట్ వివరాలు కనిపిస్తాయి. ⇒ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్‌ను క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాల నమోదు విండో కనిపిస్తుంది. ⇒మీ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి గో పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేయవచ్చు. ⇒కనిపించే ఆప్షన్లలో మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవాలి. ⇒రుసుము చెల్లించిన తరువాత సంబంధిత పూర్తి వివరాలతో మీకు రశీదు వస్తుంది. ⇒దీన్ని ప్రింట్ తీసుకుని శబరిమల వెళ్లినప్పుడు సంబంధిత అధికారికి అందజేసి మీ పూజలు, సేవలు చేసుకోవచ్చు. గమనిక: మరిన్ని వివరాలకు, శబరిమల అప్డేట్స్ కోసం ఫేస్బుక్లో ‘ట్రావెన్కోర్ దేవసోమ్ బోర్డు’, ‘శబరిమల దేవోసమ్’ పేజీలను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే పూజలు, సేవలు అష్టోత్తరార్చన: రూ.20 భగవతి సేవ: రూ.1,000 గణపతి హోమం: రూ.200 స్వయం వరార్చన: రూ.25 నాగరాజ పూజ: రూ.25 నవగ్రహ పూజ: రూ.100 నీరాజనం: రూ.75 ఉట్టగ్రహ పూజ: రూ.20 పుష్పాభిషేకం: రూ.8,500 సహస్రనామార్చన: రూ.20