
తిరువనంతపురం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్రకు ఆన్‌లైన్‌లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్ చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. కాగా, శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్ చేసుకున్నట్లు తెలిపింది. గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.