sabarimala yatra
-
తూర్పు వైపు స్వాముల చూపు
మండపేట: తిరుపతి, చెన్నైలో భారీ వర్షాలు శబరి యాత్రపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల ట్రాక్ దెబ్బతిని నెల్లూరు, చెన్నై మీదుగా కేరళ వెళ్లే రైళ్లు రద్దవ్వడంతో ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన అయ్యప్ప మాలధారులు జిల్లాకు తరలివస్తున్నారు. ఆంధ్రా శబరిమలైలుగా ప్రసిద్ది చెందిన ద్వారపూడి, శంఖవరంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు స్వాములతో కిటకిటలాడుతున్నాయి. మండల దీక్షను పూర్తిచేసుకున్న అనంతరం ఇరుముడులు సమర్పించుకునేందుకు అధికశాతం మంది శబరిమలైకి వెళుతుంటారు. ముందుగానే రైలు టిక్కెట్లు కూడా రిజర్వేషన్లు చేయించుకుంటారు. కొద్ది రోజులుగా తిరుపతి, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శబరిమలై వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సన్నిధానానికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎక్కువ మంది స్వాములు మన జిల్లాకు తరలివస్తున్నారు. వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి రోజు వందలాదిగా తరలివస్తున్న స్వాములతో ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్ప ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ఆన్నప్రసాదంతో పాటు ఉండేందుకు వసతి సదుపాయాలు ఉండటంతో మాలధారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ద్వారపూడి ఆలయంలో రోజు దాదాపు 3000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా శబరిమలై వెళ్లలేని స్వాములు జిల్లాకు వచ్చి ఇరుముడులు సమర్పించుకుంటుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివస్తున్న స్వాములతో సందడి నెలకొంది. శబరిమలై వెళ్లలేకపోయినా జిల్లాలోని ఆలయాల దర్శనంతో మంచి అనుభూతి కలుగుతోందని స్వాములు అంటున్నారు. భక్తిశ్రద్దలతో స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకుని, నేయ్యాభిషేకం, మాళిగాపురత్తమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. మాలవిసర్జన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగుపయనం అవుతున్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. శబరిమలై వెళ్లలేక శబరిమలై వెళ్లేందుకు రెండు నెలల క్రితమే ట్రై న్కు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్నాం. భారీ వర్షాలతో రైళ్లు రద్దు కావడంతో ఆంధ్రాశబరిమళైగా పేరొందిన ద్వారపూడి వచ్చాం. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. పి. కృష్ణాంజనేయులు, గండుబోయినపల్లి, చిత్తూరు జిల్లా ఆలయాలు చాలా బాగున్నాయి ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్పస్వామివారి ఆలయాలు చాలా బాగున్నాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీలు మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడే స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకున్నాం. టి. సత్యనారాయణ, గుండుగొలను, పశ్చిమగోదావరిజిల్లా -
కేరళ వర్ష బీభత్సం: 38 మంది మృతి.. సీఎం సమీక్ష
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదితన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. ఉత్తరాఖండ్‌లో వర్షం ధాటికి ఐదుగురి మృతి ఉత్తరాఖండ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా రెండో రోజు.. సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పౌరీ జిల్లాలోని లాన్స్‌డౌన్ సమీపంలోని సమ్‌ఖాల్‌లో వర్షం ధాటికి రాళ్లు జారిపడడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. వారు నివసిస్తున్న టెంట్‌పై రాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వర్షాలు తగ్గి, పరిస్థితి చక్కబడేదాకా ముందుకెళ్లకూడదని చార్ధామ్ యాత్రికులకు అధికారులు సూచించారు. చార్ధామ్ ఆలయాలకు జనాన్ని తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వర్ష బీభత్సంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు, వంతెనల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చార్ధామ్ యాత్రను మరో రెండు రోజుల పాటు నిలిపివేసుకోవాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే బస చేయాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ధామీతో ఫోన్లో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్తరాఖండ్‌కు అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. శబరిమల యాత్ర నిలిపివేత కేరళలో 10 డ్యామ్‌లకు రెడ్ అలర్ట్ పత్తనంథిట్ట: కేరళలో వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోతోంది. వీడని జడివాన కారణంగా శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ సోమవారం తెలిపారు. భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. రాష్ట్రంలో నిండుకుండల్లా మారిన 10 డ్యామ్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కక్కీ డ్యామ్‌లో రెండు గేట్లు తెరిచి, నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు స్నానమాచరించే పంపా నదిలో నీటి మట్టం 15 సెంటీమీటర్లు పెరగనుంది. కేరళలో ఈ నెల 20 నుంచి అక్టోబర్ 24న వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి తులా మాసం పూజల కోసం భక్తులను అనుమతించట్లేదని మంత్రి రాజన్ పేర్కొన్నారు. పంపా నదిలో నీటి మట్టం పెరుగుతున్నందునయాత్రను నిలిపివేశామన్నారు. దక్షిణ కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఇప్పటిదాకా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మరణించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాలు, వరద నష్టం తదితర అంశాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో అక్టోబర్‌లో అత్యధిక వర్షపాతం దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబర్ నెల 1960 నుంచి అత్యధిక వర్షాలు కురిసిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నగరంలో 1960 అక్టోబర్‌లో 93.4 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది. ఈసారి ఇదే నెలలో ఇప్పటిదాకా 94.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో 1910 అక్టోబర్‌లో 185.9 మిల్లీవీుటర్లు, 1954 అక్టోబర్‌లో 238.2 మిల్లీవీుటర్లు, 1956 అక్టోబర్‌లో 236.2 మిల్లీవీుటర్లు, 2004 అక్టోబర్‌లో 89 మిల్లీవీుటర్ల వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధానిలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 87.9 మిల్టీవీుటర్ల వర్షం కురిసింది. 1910 అక్టోబర్‌లో నగరంలో ఒక్కరోజే 152.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ నెల 18న(సోమవారం) కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. -
శబరిమల దర్శనానికి 550మంది మహిళలు
తిరువనంతపురం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్రకు ఆన్లైన్లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్ చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. కాగా, శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్ చేసుకున్నట్లు తెలిపింది. గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి తెలియకపోవడంతో బంధువులు ఆందోన చెందారు. కనీసం ఆ మహిళ సెల్ ఫోన్లు పూర్తిగా స్తంభించిపోవడంతో బంధువుల ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళల ఆచూకీ లభించడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.