Heavy Rains Lash Several Parts Of India, Uttarkhand And Kerala - Sakshi
Sakshi News home page

ఉత్తరాన వర్షాలు.. కేరళలో వరద

Published Tue, Oct 19 2021 10:00 AM | Last Updated on Tue, Oct 19 2021 12:36 PM

Heavy Rains In North India Uttarakhand And Kerala - Sakshi

న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదితన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. 

ఉత్తరాఖండ్‌లో వర్షం ధాటికి ఐదుగురి మృతి
ఉత్తరాఖండ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా రెండో రోజు.. సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పౌరీ జిల్లాలోని లాన్స్‌డౌన్‌ సమీపంలోని సమ్‌ఖాల్‌లో వర్షం ధాటికి రాళ్లు జారిపడడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. వారు నివసిస్తున్న టెంట్‌పై రాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వర్షాలు తగ్గి, పరిస్థితి చక్కబడేదాకా ముందుకెళ్లకూడదని చార్‌ధామ్‌ యాత్రికులకు అధికారులు సూచించారు.

చార్‌ధామ్‌ ఆలయాలకు జనాన్ని తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వర్ష బీభత్సంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు, వంతెనల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రను మరో రెండు రోజుల పాటు నిలిపివేసుకోవాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే బస చేయాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీఎం ధామీతో ఫోన్‌లో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్తరాఖండ్‌కు అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. 

శబరిమల యాత్ర నిలిపివేత
కేరళలో 10 డ్యామ్‌లకు రెడ్‌ అలర్ట్‌ 
పత్తనంథిట్ట: కేరళలో వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోతోంది. వీడని జడివాన కారణంగా శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్‌ సోమవారం తెలిపారు. భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. రాష్ట్రంలో నిండుకుండల్లా మారిన 10 డ్యామ్‌లకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

కక్కీ డ్యామ్‌లో రెండు గేట్లు తెరిచి, నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు స్నానమాచరించే పంపా నదిలో నీటి మట్టం 15 సెంటీమీటర్లు పెరగనుంది. కేరళలో ఈ నెల 20 నుంచి అక్టోబర్‌ 24న వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి తులా మాసం పూజల కోసం భక్తులను అనుమతించట్లేదని మంత్రి రాజన్‌ పేర్కొన్నారు.

పంపా నదిలో నీటి మట్టం పెరుగుతున్నందునయాత్రను నిలిపివేశామన్నారు. దక్షిణ కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఇప్పటిదాకా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మరణించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాలు, వరద నష్టం తదితర అంశాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీలో అక్టోబర్‌లో అత్యధిక వర్షపాతం
దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబర్‌ నెల 1960 నుంచి అత్యధిక వర్షాలు కురిసిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నగరంలో 1960 అక్టోబర్‌లో 93.4 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది. ఈసారి ఇదే నెలలో ఇప్పటిదాకా 94.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో 1910 అక్టోబర్‌లో 185.9 మిల్లీవీుటర్లు, 1954 అక్టోబర్‌లో 238.2 మిల్లీవీుటర్లు, 1956 అక్టోబర్‌లో 236.2 మిల్లీవీుటర్లు, 2004 అక్టోబర్‌లో 89 మిల్లీవీుటర్ల వర్షపాతం రికార్డయ్యింది.

దేశ రాజధానిలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 87.9 మిల్టీవీుటర్ల వర్షం కురిసింది. 1910 అక్టోబర్‌లో నగరంలో ఒక్కరోజే 152.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ నెల 18న(సోమవారం) కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement