
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది.
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2018 నాటి∙తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అయితే, నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ మీడియాకు తెలిపారు.
మా ఆదేశాలను పాటించాల్సిందే!
శబరి’ తీర్పుపై జస్టిస్ నారిమన్
న్యూఢిల్లీ: శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై.. తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ తాను, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులోని ‘అత్యంత ముఖ్యమైన’ ఆదేశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా చదవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయాలని జస్టిస్ నారిమన్ స్పష్టం చేశారు. జస్టిస్ నారిమన్ శుక్రవారం మరో కేసు విచారణ సందర్భంగా మా ఆదేశాల ఉల్లంఘనను సహించబోం. తప్పనిసరిగా అమలు చేయాల్సిందే’ అని జస్టిస్ నారిమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment