
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు.
మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు.
ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.