
శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.
తిరువనంతపురం : శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త, బంధువులు మంగళవారం దాడి చేశారు.