
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు వెళుతున్న వారిని ఆందోళనకారులు మార్గ మధ్యంలో అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. సన్నిదానం వరకు వెళ్లేందుకు తెలుగు భక్తురాలు ప్రయత్నించగా.. ఆందోళన కారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఆమె మధ్యలోనే వెనుదిరిగారు. అంతటితో ఆగని ఆందోళనకారులు నీలక్క క్యాంప్ వద్ద ఆగిన మీడియా వాహనాలపై దాడి చేశారు. ఈ దాడి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం (నేటి) సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment