
హిందువు అంటే హిందువే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 'హిందూ మతంలో పురుష హిందువు, మహిళా హిందువు అన్న భేదమే లేదు. హిందువు అంటే హిందువే' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. హిందూ మతంలో స్త్రీ-పురుష భేదం లేదని, హిందువులంతా హిందువులేనని ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. దేవాలయాల్లోకి మహిళల రాకను అడ్డుకోవడమంటే రాజ్యాంగం వారికి ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు.
అయితే శబరిమలలోకి మహిళల రాకను నిషేధించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ఆలయ ట్రస్టు, కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించాయి. శబరిమలలో కొలువైన అయ్యప్ప బ్రహ్మచారి అని, పిల్లలకు జన్మనిచ్చే మహిళల రాక వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లవచ్చునని పేర్కొన్నాయి. సనాతన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా చేసే వాదన రాజ్యాంగం కల్పించిన హక్కుల ముందు నిలబడే ఆస్కారంలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.