భద్రత నడుమ శబరిమల ఆలయంలో బిందు అమ్మిని, కనకదుర్గ
తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్నవారు) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. అయితే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ.. బుధవారం (రెండో తారీఖు) తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు)
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీలంక మహిళ శశికళ చేసిన ప్రయత్నాన్ని ప్రహసనంగా వర్ణించింది.
ఎందుకు శుద్ధి చేశారు?
ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్‌ను ట్రావెన్‌కోర్ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను పాలక మండలి వివరణ అడిగింది. (వారు చివరి మెట్టును చేరగలిగారు)
Comments
Please login to add a commentAdd a comment