
కార్మికుల జాడ పసిగట్టేందుకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు తెప్పించిన అధికారులు
నేటి ఉదయం నుంచి సొరంగంలోని ప్రమాదస్థలంలో డాగ్స్‌తో అన్వేషణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది.
నేషనల్ డిజా స్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.
శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలించనుంది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.
కొనసాగుతున్న టీబీఎం భాగాల తొలగింపు..
సొరంగం లోపల 13.650 కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉండటం తెలిసిందే. దీంతో ఆయా భాగాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి టీబీఎం భాగాలను కట్ చేస్తూ, మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు.
కన్వేయర్ బెల్టును ప్రమాదస్థలం వరకు కొనసాగించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్, జాయింట్ మెషీన్, కమిషన్ పనులు పూర్తవగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి కన్వేయర్ బెల్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు.
నేడు రంగంలోకి టన్నెల్ ప్రత్యేక నిపుణులు..
సొరంగంలో ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీత కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఐఐటీ చెన్నైకి చెందిన టన్నెల్ నిపుణులు శుక్రవారం దోమలపెంటకు రానున్నారు. ఇప్పటికే ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ప్రమాదస్థలానికి పరిశీలించారు.
ప్రత్యేక పరికరాలు లేదా ఏఐ రోబోల ద్వారా కార్మికుల వెలికితీత సాధ్యమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్‌ఐ, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన నిపుణులు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని సొరంగం పైభాగంలో భూమి పరిస్థితులపై సర్వే పనులను కొనసాగిస్తున్నారు.

13 రోజులుగా శిథిలాల కిందే..ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుంగిన ప్రమాదంలో 8 మంది కారి్మకులు, ఇంజనీర్లు గత 13 రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 12 ఏజెన్సీలు, సంస్థలు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకుండానే 14 కి.మీ. వరకు ఏకధాటిగా టీబీఎం ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రమాదస్థలంలో రెస్క్యూ బృందాలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి.
టన్నులకొద్దీ పేరుకుపోయిన మట్టి, శిథిలాలను బయటకు తరలించేందుకు రోజుల సమయం పడుతోంది. దీంతో ఈ తరహా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ వారి ఆచూకీ నేటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment