షమీర్ ఇంటి వద్ద బాంబు దాడి అనంతర దృశ్యాలు
కన్నూర్: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న అలజడి ఇంకా చల్లారలేదు. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తలాసరీ ప్రాంత ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు ఏఎన్ షమీర్, బీజేపీ ఎంపీ వి మురళీధరన్ నివాసాలతో పాటు పలుచోట్ల శుక్రవారం రాత్రి బాంబు దాడులు జరిగాయి. షమీర్ ఇంటిపైకి దుండగులు నాటు బాంబులు విసిరారు. ఇరిట్టి ప్రాంతంలో సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు.
రాష్ట్రంలో దాడులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కుట్రలు చేస్తోందని షమీర్ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన ఇంటిపై దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని మురళీధరన్ ఆరోపించారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కన్నూరు జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనలు కొనసాగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ప్రధాని మోదీ ర్యాలీ వాయిదా
కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ‘జనవరి 6న పతాన్‌మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. కేరళలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని పర్యటన వాయిదా పడటానికి సంబంధం లేద’ని బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి రాజకీయ ర్యాలీ ఇదే.
Comments
Please login to add a commentAdd a comment