![51 womens visited in sabarimala temple - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/19/SS.jpg.webp?itok=iCurq84C)
న్యూఢిల్లీ/తిరువనంతపురం: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు.
తప్పులతడకగా అఫిడవిట్..
కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో అయ్యప్పను దర్శించుకున్న మహిళల ఆధార్, టెలిఫోన్ నంబర్లను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమిళనాడుకు చెందిన పరంజ్యోతి(47) అనే పురుషుడి పేరును కేరళ ప్రభుత్వం అఫిడవిట్‌లో చేర్చినట్లు బయపడింది. అలాగే అఫిడవిట్‌లో పేర్కొన్న కళావతి మనోహర్ వయస్సు 52 సంవత్సరాలనీ, 43 ఏళ్లు కాదని ఆమె కొడుకు చెప్పారు.
ఆ మహిళలకు రక్షణ కల్పించండి..
అయ్యప్పస్వామిని దర్శించుకున్న బిందు(42), కనకదుర్గ(44)లకు భద్రత కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బిందు, కనకదుర్గల భద్రత మినహా ఈ రిట్ పిటిషన్‌లో తాము ఇతర అంశాల జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బిందు ఇంటివద్ద నలుగురు అధికారులు, అత్తచేతిలో దాడికి గురై ఆసుపత్రిలో ఉన్న కనకదుర్గకు 19 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బిందు కోజికోడ్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా, కనకదుర్గ పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment