తిరువనంతపురంలో ఆందోళనకారులను చెదరగొడుతున్న దృశ్యం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి సురేంద్రన్ అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) గురువారం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఆందోళనకారులు సురేంద్రన్ ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తొలుత జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలకు తన వైఖరి తెలియజేయాలని సీపీఎంనేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
12 ఏళ్లకు పూర్వమే ఆరెస్సెస్ కోరింది..
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ 12 ఏళ్ల క్రితమే ఆరెస్సెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి సురేంద్రన్ అన్నారు. బీజేపీ తలపెట్టిన 5 రోజుల ‘లాంగ్‌మార్చ్’ను..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేపట్టిన రథయాత్రతో పోల్చారు. ‘లాంగ్‌మార్చ్‌ను చూస్తుంటే నాకు రథయాత్ర గుర్తుకొస్తోంది. అన్ని వయసున్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని ఆరెస్సెస్ 12 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు’ అని అన్నారు.
మసీదుల్లోకి అనుమతించాలి..
శబరిమల తీర్పు స్ఫూర్తితో అన్ని మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంఘం నిసా యోచిస్తోంది. మహిళలను కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలనే కాకుండా వారిని ఇమామ్‌లుగా కూడా నియమించాలని ఉద్యమించనుంది.
Comments
Please login to add a commentAdd a comment