హింసా సంస్కృతి ఏ సందేశానికి? | Sakshi Guest Column On Culture of violence in India | Sakshi
Sakshi News home page

హింసా సంస్కృతి ఏ సందేశానికి?

Published Tue, Aug 15 2023 12:23 AM | Last Updated on Tue, Aug 15 2023 12:23 AM

Sakshi Guest Column On Culture of violence in India

డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్‌ ఇంజన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది.

అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్‌ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్‌ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్‌ శక్తిమంతంగా పనిచేస్తోంది.

ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్‌ ఇంజన్‌తో, అంటే రెండో ఇంజన్‌ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు.

వాస్తవానికి మణిపుర్‌లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్‌ ఇంజన్‌’ పవర్‌తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్‌ – ఆరెస్సెస్‌.

మూడవ ఇంజన్‌ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్‌. 1999లో బీజేపీ, ఆరెస్సెస్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్‌–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్‌లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్‌ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోంది. 

రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్‌ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్‌పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్‌ అయిన ఆరెస్సెస్‌ ప్రమేయం లేకుండా... మణిపుర్‌లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్‌ ఇంజన్‌. 

స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’.

ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్‌సంఘ్‌ చాలక్‌ మాట్లాడుతున్నారు. మణిపుర్‌లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్‌ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు!

నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్‌ ఇంజన్‌ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్‌ నింపిన ఆ ఇంజన్‌కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు.

గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. 

అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్‌కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్‌ ఇంజన్‌ ఉండకపోవచ్చు.

కానీ ఇప్పుడు మణిపుర్‌లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్‌ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి?
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement