దేశం నివ్వెరపోయింది. ఆ మహిళ దేహం మీద నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా పాకిన ఆ మగ చేతిని చూసి ప్రజానీకం నిస్సహాయ క్రోధంతో వణికిపోతున్నారు. మణిపుర కుకీ గిరిజన తెగకి చెందిన ముగ్గురు క్రిస్టియన్ మహిళలను నగ్నంగా మార్చి, ఊరేగించి, అందులో ఒకరిని అత్యాచారం చేసిన ఘటన తాలూకు వీడియో ఇపుడు దేశంలో అనేకమందిని కలవరానికి లోను చేస్తోంది.
సోషల్ మీడియా అందరికీ అందు బాటులోకి వచ్చాక స్త్రీలను, దళిత, గిరిజనులను వివస్త్రలను చేసి చితక బాదడం, చంపడం వంటి వీడియోలు అడపాదడపా వైరల్ అవుతూ ఉన్నాయి. నచ్చిన దుస్తులు వేసుకోవడం, నచ్చిన చోట్లకి వెళ్ళడం, నచ్చిన వారితో కలిసి గడపడం, ఇష్టమైన ఆహారం తినడం తప్పుగా మారి పోయాయి. ప్రేమలు, పరువులు, చేతబడుల వంక బెట్టి వారి శరీరాలను దారుణంగా హింసించడం – వీటన్నిటికీ పీడిత వర్గాల పట్ల సమాజానికి ఉన్న తక్కువ భావనే తక్షణ కారణం అయి ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో వేరే బలమైన కారణాలు ఉంటాయి.
గుజరాత్‌లో ముస్లిం జాతి హనన మారణకాండలో వేలాది స్త్రీలమీద మూకుమ్మడి అత్యాచారాలు చేయడం, ప్రాబల్య కులాల స్త్రీలు కూడా దగ్గరుండి ప్రోత్సహించడం సమీప చరిత్ర. నగ్నదేహాలతో, రోడ్డున దొరికే చిత్తుపాతలు కప్పుకుంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టిన గుజరాత్ ముస్లిం మహిళల గురించి అనేక నివేదికలు తెలియజెప్పాయి.
ఇప్పుడు మణిపురలో జరుగుతున్నది సారంలో గుజరాత్‌కి భిన్నం కాదు. అక్కడ ముస్లింలు అయితే ఇక్కడ గిరిజన క్రిస్టియన్లు. ఇటువంటి సందర్భాలకి ప్రతిస్పందించే విషయంలో మనం చాలాసార్లు చేసే పొరపాటు – బాధితులను జండర్‌కి మాత్రమే కుదించి చూడడం. మణిపుర ఘటన వెనుక మతం, రాజకీయ ప్రయోజ నాలతో పాటు ఆర్థిక అంశాల పాత్ర తిరుగులేనిది.
కులమైనా, మతమైనా, దేశమైనా– సమాజంలోని ఏ ప్రధానమైన అంశంలోనయినా బలమైన వర్గం బలహీన వర్గంపై దాడి చేయాలంటే అందుకు అనువుగా దొరికేది ముందుగా స్త్రీలు. వారి ద్వారా ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించడం ఆటవిక సమాజాల స్వభావం. అదిప్ప టికీ సాగుతూనే ఉంది. అయితే ఏ స్త్రీలు ప్రధానంగా బాధితులు అన్నది గ్రహించడం చాలా ముఖ్యం.
పై మహిళల విషయానికి వస్తే వారి చుట్టూ కొల్లగొట్టదగిన ఖనిజ సంపదలు ఉన్నాయి కనుక, వారు కుకీ తెగ గిరిజనులు కనుక, వారు క్రిస్టియన్లు కనుక, ఈ అస్తిత్వాలు మైనార్టీ కనుకనే వారి మీద వందలాదిగా తరలి వచ్చి దాడి చేశారు. వందల, వేల గుంపులు కూడి సాగించే దాడులలో ప్రధానంగా కులమో, మతమో, వర్గమో, దేశభక్తో ఉండి తీరుతుంది.
ఆయా కక్షలు తీర్చుకోవడానికి స్త్రీలను వాహికలుగా ఉపయోగించుకుంటారు. ఈ ఘటనలో నగ్నంగా ఊరేగించిన తమ స్త్రీలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఒక తండ్రిని, అతని కొడుకుని విద్వేషకారులు చంపేయడం చూస్తే అక్కడి మైనార్టీలకి మాత్రమే సంపదలు ఒనగూడుతున్నాయన్న తీవ్ర ద్వేషం కనపడుతుంది.
ఇటువంటి ఘటనలలో గుర్తించవలసిన మరొక విషయం – దాడులు సాగించినవారే కాస్త సమయం చూసుకుని తమ ప్రతాపాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాకి ఎక్కించడం. మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల తమ ఉనికి తెలీదన్న ధీమా, తప్పొప్పుల విచక్షణ ఏ కోశానా లేకపోవడం, కులం, మతం, వర్గం, స్థానిక ప్రభుత్వాల దన్ను తమకు ఉంటుందన్న అహం ఆణువణువూ నిండిపోవడం, పై పెచ్చు ఇవన్నీ విజయ సంకేతాలుగా భావించడం – యథా రాజా తథా ప్రజ. ప్రభుత్వం ఈ వీడియోను అన్ని మాధ్యమాల నుంచి తొలగించే పని సత్వరం చేయడానికి కారణం ప్రజల భావోద్వేగాల పట్ల అక్కర కొద్దీ కాదు... ఎన్నికల ముందు తటస్థులను దూరం చేసుకోకూడదన్న విజ్ఞత వల్ల మాత్రమే!
ఇక మెల్లిగా ‘ఉరిశిక్ష రాగం’ గొంతు సవరిస్తోంది. ఆ మహిళలకు న్యాయం జరగాలంటే ఉరిశిక్ష వేస్తామని ఒక పెద్దాయన సెలవిచ్చాడు. మరి వందల మందికి, ఆ మహిళలని మూకకి అప్పగించి చూస్తూ నిలబడిన పోలీసులకి ఉరితాళ్ళు సిద్ధం చేస్తున్నారా సారూ! ఈ సారైనా మనం ‘ఉరి’ ఉచ్చులో చిక్కుకోకూడదు. రగిలే గుండెలకీ, భయంతో వణికే మనసుకీ అటువంటి శిక్ష కాస్త సాంత్వననూ, ధైర్యాన్నీ ఇవ్వొచ్చు. అక్కడికి దుష్ట శిక్షణ జరిగిందని ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మన బాధ్యత అక్కడితో తీరేది కాదు. అందరూ ప్రభుత్వాలతో తలపడే ఆచరణలోకి దిగలేకపోవచ్చు. కనీసంగానైనా మనమేం చేయాలి?
లోకపు రీతుల పట్ల మనం ఏర్పరుచుకునే అవగాహన, భవిష్యత్ నాయకుల ఎంపికకు మార్గాన్ని చూపుతుందని నమ్మాలి. దాడి చేసినవారిలో అనువుగా దొరికిన ఒకరిద్దరిని ఉరితీసి, ప్రజల కోరికని మన్నించిన వీరుల్లా ఛాతీ విరుచుకు నిలబడే అసలు దొంగలను గుర్తించాలి. మణిపురలో కుకీ జాతి హనన మారణకాండకు వెనకుండి అండ దండలు అందించిన శక్తులను ముందుగా మనం గుర్తించాలి.
సొంత ప్రజల మధ్యనున్న వర్గ, సామాజిక వైరుద్ధ్యాలను అవకాశవాదంతో పక్కన పెట్టి, సాంస్కృతిక, రాజకీయ భిన్నత్వపు సౌందర్యాన్ని ధ్వంసం చేసి, ‘జాతీయ’ రహదారి మీద ఏకతా యాత్ర చేస్తున్న బుల్డోజర్‌కి అందరమొక్కటై ఎదురుగా నిలబడాలి. నిలబడదాం రండి!
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే
వారు స్త్రీలు మాత్రమే కాదు!
Published Sun, Jul 23 2023 3:06 AM | Last Updated on Sun, Jul 23 2023 3:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment