బెయిల్ మీద వచ్చిన వారికి పూలమాలలతో స్వాగతం పలికిన మంత్రి జయంత్ సిన్హా
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్‌పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా.
ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు.
కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment