డిస్పూర్ : అస్సాంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ దారుణం చోటు చేసుకుంది. గ్రామస్థుని మీద దాడి చేసిందనే కోపంతో.. ఊరు వాళ్లు ఓ చిరుతపులిపై దాడి చేసి చంపేశారు. అంతటితో ఊరుకోక దాని కాళ్లను నరికి.. కను గుడ్లను పీకేసి.. తాడుకు కట్టి వేలాడిదీశారు. ఈ దారుణం అస్సాం ఛారొడియో జిల్లాలోని బోర్త్ ప్రాంతంలో ఉన్న వెసిలిపతర్ గ్రామంలో చోటు చేసుకుంది. గత కొన్ని వారాల నుంచి ఈ చిరుత పరిసర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. గ్రామంలో ప్రవేశించి.. పశుపక్ష్యాదుల మీద దాడి చేసి చంపుతుంది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నీలేశ్వర్ చాంగ్‌మాయి అనే గ్రామస్థుని మీద దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం అతను డిబ్రూగఢ్ అస్సాం మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేటికి కూడా అతని పరిస్థితి విషమంగానే ఉంది. జంతువులను చంపడమే కాక మనుషుల మీద కూడా దాడి చేయడంతో..గ్రామస్థుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఈ విషయం గురించి అటవి శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఓపిక నశించిన గ్రామస్థులు స్వయంగా తామే రంగంలోకి దిగి.. చిరుతను ఇలా దారుణంగా మట్టు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment