
శ్రీనగర్: గోవులను తరలిస్తున్నారనే అనుమానంతో ముస్లింలపై దాడులు, హత్యలకు అడ్డుకట్టపడకుంటే అది మళ్లీ దేశ విభజనకు దారి తీస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీపీ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
‘గో సంరక్షకుల పేరుతో ముస్లింలపై దాడులు, మూకహత్యలను అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నాం. ఇప్పటికే 1947లో దేశ విభజన జరిగింది. ముస్లింలపై దాడులు ఇంకా కొనసాగితే అది మరోసారి దేశం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో మొన్నటి దాకా సాగిన బీజేపీతో పీడీపీ పొత్తు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యంగా కాశ్మీరీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కానీ, అధికారం కోసం మాత్రం కాదన్నారు.