ఆ హత్యపై మౌనం వీడిన మోదీ
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, దురదృకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. గత నెలలో ఉత్తరప్రదేశ్లోని దాద్రి గ్రామంలో గోవధ వార్తలు బయటకొచ్చి మహ్మద్ అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తి ఆ గోవు మాంసం ఉందని కారణంతో గ్రామంలోని పలువురు హిందువులు అతడిపై దాడి చేసి కొట్టి చంపారు. అతడి కుమారుడు తీవ్రగాయాలపాలయ్యాడు.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మతపరమైన అంశాలను ప్రాథమికంగా చేసుకొని కొందరు హిందువులు కావాలనే దాడులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపట్ల స్పందించడానికే పలువురు కేంద్రమంత్రులు తొలుత వెనుకాడినా అనంతరం స్పందించారు.
కానీ ప్రధాని ఈ ఘటనపట్ల ఇప్పటి వరకు ఏ విధంగాను స్పందించలేదని విమర్శలు వచ్చాయి. ఇంతలోనే ఆయన దాద్రి ఘటనను ప్రస్తావించారు. ఓ బెంగాల్ పత్రికతో మోదీ మాట్లాడుతూ'దాద్రి, గులాం అలీ కార్యక్రమం అడ్డుకోవడంవంటి ఘటనలు నిజంగా విచారకరం. దురదృష్టకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేమిటి? బీజేపీ ఇలాంటి ఘటనలకు మద్దతివ్వబోదు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనలను రాజకీయాలు చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బీజేపీ విరుద్ధం' అని చెప్పారు. దీంతోపాటు పాక్ సింగర్ గులాం అలీపై, పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఇంక్ దాడి ఘటనను కూడా ప్రధాని మోదీ ఖండించారు.