TRS Tweet: Controversy On PM Narendra Modi Ramagundam Visit - Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రొటోకాల్‌ రగడ!.. కేసీఆర్‌ను పిలవరా? 

Published Tue, Nov 8 2022 4:59 PM | Last Updated on Wed, Nov 9 2022 10:24 AM

TRS Tweet: Controversy On PM Narendra Modi Ramagundam Visit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్‌ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించింది.

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే నిమిత్తం ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రానికి వస్తున్నారు. దీనికి ఆహ్వానం విషయంలో వివాదం మొదలైంది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం కూడా అధికారిక భాగస్వామిగా ఉన్నా.. మోదీ ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ పాటించడం లేదని టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సీఎం కేసీఆర్‌కు నామమాత్రంగా ఆహ్వానం పంపడం ద్వారా తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడింది. ఆహ్వాన పత్రంలో ప్రధాని మోదీ తర్వాత సీఎం హోదాలో కేసీఆర్‌ పేరు ఉండాలని.. కానీ ప్రొటోకాల్‌ పాటించలేదని ట్విట్టర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పించింది. దీనితోపాటు 2020 నవంబర్‌లో భారత్‌ బయోటెక్‌ సందర్శన కోసం అధికారికంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ.. ప్రొటోకాల్‌  ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ను అవమానించారని టీఆర్‌ఎస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.  

ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? 
ఇక మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కీలక అంశాలపై నిలదీయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. పలు అంశాలపై ప్రశ్నలు, నిలదీతలతో ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు మొదలుపెట్టింది. ‘‘మోదీ గారూ.. తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా? ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల సంగతేంటి? నీతి ఆయోగ్‌ చెప్పిన నిధులిచ్చేది ఎప్పుడని తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది..’’ అని పేర్కొంది.

రామగుండం ఎరువుల కర్మాగారంలో 2021 మార్చిలోనే ఉత్పత్తి మొదలైందని, ఇప్పటివరకు 10 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసిందని గుర్తు చేసింది. ‘‘మోదీ తెలంగాణకు వస్తున్నారు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయటపడింది. నిన్న మునుగోడులో బీజేపీ ఓడిపోయింది. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు రెండేండ్ల క్రితమే పునః ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం పేరిట మాయ చేసేందుకే మోదీ వస్తున్నారు..’’ అని టీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పించింది.

రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ఉత్సాహం చూపుతున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు, ఇతర అంశాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం సాగుతుండగా.. ఇప్పుడు మోదీ పర్యటన, ప్రోటోకాల్‌ రగడ మరింత ఆజ్యం పోసే పరిస్థితి కనిపిస్తోంది. 

ప్రధాని టూర్‌కు కేసీఆర్‌ దూరమే! 
2020 నవంబర్‌లో హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. దానితో ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ప్రధాని కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చి సీఎంను పిలవకపోవడం/సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని టీఆర్‌ఎస్‌ అప్పట్లోనే తీవ్రంగా మండిపడింది. ఆ తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినా స్వాగత కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. 
►ఈ ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్‌ కార్యక్రమాలకు వచ్చిన ప్రధానిని ఆహ్వానించే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగించారు. కేసీఆర్‌ వెళ్లలేదు. 
►ఈ ఏడాది మేలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవానికి మోదీ వచ్చినా కేసీఆర్‌ ఆహ్వానం పలకలేదు. ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. 
►జూలై రెండున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ హైదరాబాద్‌కు రాగా కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. అదే రోజున విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన యశ్వంత్‌ సిన్హాకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఎదురెళ్లి భారీ స్వాగతం పలికారు. 
►ఇవేకాదు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పలు వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాల్లో కూడా సీఎం హోదాలో కేసీఆర్‌ పాల్గొనలేదు. మంత్రులు, ఉన్నతాధికారులే హాజరయ్యారు. 
►ఈ నేపథ్యంలో ఈ నెల 12న రామగుండంలో ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

చదవండి: ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement