సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా రామగుండంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాధించిన ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 8 ఏళ్ల కాలంలో దేశంలో తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో తీసుకొచ్చిన పలు విప్లవాత్మక విధానాలు, తద్వారా పొందిన ఫలితాలను వివరిస్తారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రైతు అనుకూల విధానాలతో రైతాంగానికి చేకూరిన మే లును వివరిస్తారని బీజేపీ వర్గాల సమాచారం.
రామగుండం సభలో టీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలతో పాటు బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తారని చెబుతున్నారు. కేంద్రం అమ లు చేస్తున్న పలు పథకాలు ముఖ్యంగా రైతులకు మేలు చేకూర్చే వాటిని టీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేయకపోవడం, దీంతో జరుగుతున్న నష్టాన్ని వివరిస్తారని తెలిసింది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు ఎరువులు సరఫరా కానున్నాయి. తద్వారా రోడ్లు, రైల్వే, అనుబంధ పరిశ్రమలు బలోపేతమై ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
3 దశాబ్దాల తర్వాత ప్రధాని సభ..
మోదీ సభ విజయవంతం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి జనసమీకరణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం నడుం బిగించింది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని సభ జరుగుతుండటంతో దానిని సక్సెస్ చేసేందుకు కార్యాచరణను రూపొందించుకున్నారు. గతంలో ఎన్‌టీపీసీ పరిశ్రమ శంకుస్థాపనకు అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్, ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మరో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని అధికారిక పర్యటనకు వస్తుండటం.. సభ నిర్వహిస్తుండటంతో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. 2016, ఆగస్ట్ 7న ఈ ఎరువుల ఫ్యాక్టరీకి మోదీ శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే.
ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారు?
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం
- అక్కడ నిర్వహించే సభలోనే రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి రైలు లైన్లు కూడా జాతికి అంకితం
Comments
Please login to add a commentAdd a comment