బెంగళూరు: హిందీ భాషాధిపత్య వ్యవహారం.. రాజకీయంగా ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణం అయ్యింది. ఈ విషయంలో కన్నడ స్టార్ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ మధ్య జరిగిన ట్వీట్ల రచ్చ జరిగింది. ఒకానొక దశలో ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో అనిపించింది. ఇదిలా ఉంటే..
తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ఆదిపత్య రగడపై పరోక్షంగా స్పందించారు. దేశంలోని ప్రతి భాషను బీజేపీ సంప్రదాయ ప్రతిబింబంగానే చూస్తుందని, ప్రతీ భాషను గౌరవిస్తుందని అన్నారు. భాషా ప్రతిపాదికన వివాదాలు ప్రేరేపించే అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ తరుణంలో..
ప్రధాని ఇలాంటి ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు. ‘‘ప్రతీ ఒక్కరూ తమ భాషను గొప్పగా భావించాలి. ఆయన(ప్రధాని) ఇలా మాట్లాడటాన్ని గౌరవిస్తున్నా. ఇది అన్ని భాషలకు సంబంధించి విషయం. కేవలం కన్నడ గురించి మాత్రమే నేనేం మాట్లాడలేదు. ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని కేవలం ఒక రాజకీయవేత్తగా మాత్రమే చూడొద్దు.. ఈ వ్యాఖ్యలతో ఆయన్ని ఒక నేతగా చూడాల్సిన అవసరం ఉంది’’ అని సుదీప్ అభిప్రాయపడ్డాడు.
ఏదో చర్చ జరగాలనో, గొడవలు జరగాలనో నేను ప్రారంభించలేదు. ఎలాంటి ఎజెండా లేకుండానే అలా జరిగిపోయింది. నా అభిప్రాయం మాత్రమే వినిపించా. ఇప్పుడు ప్రధాని నోట నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంతోషంగా ఉంది అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సుదీప్ చెప్పుకొచ్చాడు.
చదవండి: చిచ్చు పెట్టిన ‘హిందీ’ భాష
Comments
Please login to add a commentAdd a comment