న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా పర్యటనలో తెలిసిందంటూ విపక్షాల్ని విమర్శించారు. ఆరు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలోని పాలం విమానాశ్రయం వెలుపల తనకు స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి మాట్లాడారు.
సిడ్నీలో భారత సంతతికి చెందిన సదస్సులో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసెతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, మాజీ ప్రధాని కూడా హాజరయ్యారన్నారు. ‘‘భారతీయులకు చెందిన ఒక కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ హాజరై తమ దేశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, బలాన్ని అలా చాటారు’’ అని మోదీ కొనియాడారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించే విపక్ష పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆస్ట్రేలియాలో భారతీయ ప్రతినిధులందరికీ అరుదైన గౌరవం దక్కిందంటే అది మోదీకున్న కీర్తిప్రతిష్టల వల్ల కాదని, భారత్‌కున్న పటిష్టమైన బలం వల్లనేనని ప్రధాని స్పష్టం చేశారు.
భారత్ చెప్పేది విదేశాలన్నీ వింటున్నాయని, మెజార్టీ ప్రభుత్వం ఉండడమే దానికి కారణమని చెప్పారు. తాను వినిపించేది 140 కోట్ల భారతీయుల గళమేనని ప్రపంచ నాయకులందరికీ బాగా తెలుసునన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. అయితే సవాళ్లనే సవాల్ చేయడం తన స్వభావమని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో కోవిడ్ టీకాలు విదేశాలకు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో నిలదీశాయని, కానీ ఎందరో ప్రాణాలు నిలిపినందుకు వారంతా భారత్‌కు కృతజ్ఞతగా ఉన్నారని అన్నారు. బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలపై శత్రువులపైన కూడా కరుణ చూపిస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
వారసత్వ రాజకీయాలు అభివృద్ధి నిరోధం
డెహ్రాడూన్: దేశాన్ని ఏళ్ల తరబడి పరిపాలించి హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకునే పార్టీలు వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి వారసత్వ రాజకీయాలే అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు. ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటి వందేభారత్ రైలుని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ డెహ్రాడూన్–ఢిల్లీ రైలు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌ను పెంచామన్నారు. 2014కి ముందు రూ.200 కోట్ల కంటే తక్కువ ఉంటే, ప్రస్తుతం రూ.5 వేల కోట్లు ఉందన్నారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ట్రాకుల్ని ఆధునీకరిస్తే మరింత హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టవచ్చన్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీ దానిని గుర్తించకుండా అవినీతి, కుంభకోణాలతో మునిగిపోయిందని విమర్శించారు. వారసత్వ రాజకీయాల నుంచి ఆ పార్టీ బయటపడలేకపోవడంతో దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment