Political Tussle Over India's New Parliament Building Inauguration - Sakshi
Sakshi News home page

India new parliament building: ప్రారంభ ‘గౌరవం’పై.. పెను దుమారం

Published Thu, May 25 2023 5:33 AM | Last Updated on Thu, May 25 2023 10:30 AM

India new parliament building: Political Tussle Over New Parliament Building - Sakshi

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ తీవ్ర రూపు దాలుస్తోంది. కొత్త భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండటం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ఎలా ప్రారంభిస్తారంటూ ముక్త కంఠంతో ఆక్షేపిస్తున్నాయి.

భవనాన్ని ప్రారంభించాల్సిందిగా మోదీని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆహ్వానించడంపై మండిపడుతున్నాయి. అంతేగాక వి.డి.సావర్కర్‌ వంటి హిందూత్వవాది జయంతి రోజునే ప్రారంభోత్సవం జరపనుండటాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని ఒకే వర్గానికి పరిమితయ్యే రోజున చేయనుండటం తప్పేనని వాదిస్తున్నాయి. దాంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది.

చివరికి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించే దాకా వెళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీపై నిర్ణాయకమైన సమైక్య పోరుకు పార్లమెంటు భవనం అంశంతోనే శ్రీకారం చుట్టే యోచనలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద జాతీయ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ముందే ఎన్నికల వేడి రాజుకుంటోందనేందుకు దీన్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు.

ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..?
పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అవేమంటున్నాయంటే...
► ఆర్టికల్‌ 79 ప్రకారం ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంటు.
► సాధారణంగా అంతా రబ్బరు స్టాంపుగా పరిగణించే భారత రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యం కట్టబెట్టింది.
► ఉభయ సభలకు అధిపతి గనుక దేశ ప్రథమ పౌరుని హోదాలో కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు కచ్చితంగా రాష్ట్రపతిదే.
► ఎందుకంటే ప్రధాని పార్లమెంటు లోని ఒక అంగమైన లోక్‌సభకు మాత్రమే నేతృత్వం వహిస్తారు.
► ఆ కోణం నుంచి చూస్తే రాజ్యాంగపరంగా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రధాని ఆవిష్కరించడానికి వీల్లేదు.
► ఏటా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్‌ 87 ప్రకారం రాష్ట్రపతిదే.
► పార్లమెంటు ఆమోదించే బిల్లులన్నీ ఆర్టికల్‌ 111 మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్ట రూపం దాలుస్తాయి.
► అలాంటప్పుడు రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అధికార బీజేపీ అహంకారానికి, లెక్కలేనితనానికి తాజా నిదర్శనం.

గతానుభవాలు ఏం చెబుతున్నాయి?
ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా ఇలా వ్యవహరించాలంటూ నియమ నిబంధనలేవీ లేవు. కాకపోతే గత ప్రధానులు తమ వ్యవహార శైలి ద్వారా వీటి విషయమై చక్కని సంప్రదాయాలను నెలకొల్పి ఉంచారన్నది విపక్షాలు చెబుతున్న మాట. వారిలో కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజ్‌పేయి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఆ సంప్రదాయాలను పాటించడం విజ్ఞత అనిపించుకుంటుందని అవి అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే...

నాడు ‘గాంధీ’ గిరి..
లోక్‌సభ సచివాలయమైన ‘పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌’ ప్రచురణల రికార్డుల ప్రకారం పార్లమెంటు అనుబంధ భవన నిర్మాణానికి 1970 ఆగస్టు 3న నాటి రాష్ట్రపతి వి.వి.గిరి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని 1975 అక్టోబర్‌ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. అంటే రెండు కార్యక్రమాలుగా ఇద్దరూ పంచుకున్నారు. అలా చూసినా పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్‌ 10న మోదీ భూమి పూజ చేశారు. కనుక ప్రారంభోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరగాలన్నది విపక్షాల వాదన.

వాజ్‌పేయిదీ అదే బాట...
2002లో వాజ్‌పేయి హయాంలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని నాటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ప్రారంభించారు. లోక్‌సభ సచివాలయం సంప్రదాయాల ప్రకారం భవనాన్ని ప్రారంభించాల్సిందిగా  రాష్ట్రపతినే స్పీకర్‌ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్ని  రాష్ట్రపతే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్‌. ‘‘2002లో కేంద్రంలో ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వమే. వాజపేయి ప్రధాని హోదాలో  రాష్ట్రపతి పదవికి అలాంటి గౌరవమిచ్చారు. కనీసం దీన్నుంచైనా మోదీ నేర్చుకోవాలి’’ అని మోదీకి విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు.

అలాంటి అవమానాలు వద్దు
రాష్ట్రపతి కేవలం దేశ ప్రథమ పౌరుడు మాత్రమే కాదు. ఆర్టికల్‌ 53 ప్రకారం త్రివిధ బలగాలకు సుప్రీం కమాండర్‌. మోదీ చేయ బోతున్న పని అక్షరాలా అలాంటి దేశ అత్యున్నత పదవిని విస్మరించించడం, కించపరచడమేనని విపక్షాలంటున్నాయి. రాష్ట్రపతిని ఇలా అవమాని స్తుంటే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతినిలా న్యూనత పరచడం మోదీకి కొత్తేమీ కాదంటూ గత ఉదంతాలను గుర్తు చేస్తు న్నాయి. ‘‘2019 ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను ప్రధాని హోదాలో మోదీయే ప్రారంభించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కార్యక్రమానికి దూరం పెట్టి ఘోరంగా అవమానించారు. గణతంత్ర పరేడ్‌లో త్రివిధ బలగాల నుంచి రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు. యుద్ధంలో వీరమరణం పొందే సైనిక యోధులకు వీర చక్ర, అశోక చక్ర వంటి గౌరవ పురస్కారాలనూ ఆయనే ప్రదానం చేస్తారు. అలాంటిది యుద్ధ వీరుల జ్ఞాపకార్థం నిర్మించిన వార్‌ మెమోరియల్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి భాగస్వామ్య మే లేకుండా చేయడం అతి పెద్ద తప్పిదం. మోదీ లెక్కలేనితనానికి ఇది రుజువు’’ అంటూ మండిపడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా అలాంటి తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచిస్తున్నాయి.

కేంద్రం ఏమంటోంది.?
ఎటుపోయి ఎటొస్తుందోనని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ రగడపై ఇప్పటిదాకా నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడిక తప్పనిసరై ఒక్కోలా స్పందిస్తున్నారు. బహిష్కరణ నిర్ణయంపై విపక్షాలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అనునయించే ధోరణిలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాత్రం, ‘కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టడం
విశేషం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement