వాట్సప్‌ రూమర్లతో.. ఏడుగురి హత్య! | WhatsApp rumours causes mob killing of 7 in jharkhand | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ రూమర్లతో.. ఏడుగురి హత్య!

Published Mon, May 22 2017 1:55 PM | Last Updated on Fri, Jul 27 2018 2:01 PM

వాట్సప్‌ రూమర్లతో.. ఏడుగురి హత్య! - Sakshi

వాట్సప్‌ రూమర్లతో.. ఏడుగురి హత్య!

జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సప్‌లో వదంతులు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్తులు కొంతమందిని పట్టుకుని చితక్కొట్టారు. దాంతో ఏడుగురు మరణించారు. ఈ కేసులో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని పోలీసులు అంటున్నారు. వికాస్‌ కుమార్‌వర్మ, గౌతమ్‌ కుమార్‌ వర్మ, గంగేష్‌ గుప్తా అనే ముగ్గురినీ నగాడి అనే ప్రాంతంలో గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి ప్రాణాలు తీసేశారు. వికాస్‌, గౌతమ్‌ల నాయనమ్మపై కూడా దారుణంగా దాడి జరిగింది.

ఇక రాజానగర్‌లో కూడా నలుగురు వ్యక్తులను సొసొమౌలి గ్రామస్తులు పట్టుకుని వాళ్లు కిడ్నాపింగ్‌ గ్యాంగ్‌ సభ్యులన్న అనుమానంతో కొట్టి చంపేశారు. కొం‍తమంది వ్యక్తులు పిల్లలను కిడ్నాప్‌ చేసి, వాళ్ల శరీర భాగాలను అమ్మేస్తున్నారంటూ వాట్సప్‌లో రూమర్లు వ్యాపించాయి. దాంతో అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఏడుగురినీ గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి మరీ ప్రాణాలు బలిగొన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా శాంతంగా ఉంటారని, అయితే రూమర్ల కారణంగా వారిలో భయం పుట్టి అదే ఇలాంటి ఘటనలకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికరులు అంటున్నారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని వాళ్లను అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంగా చేసిన దాడిలో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు వేసుకొచ్చిన కార్లు, జీపులను కూడా తగలబెట్టేశారు. ఏడుగురి హత్యలు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జంషెడ్‌పూర్‌ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్తులు పోలీసులతో గొడవపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement