ఆరునూరైనా ముస్లిం రిజర్వేషన్లు..
చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్.. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారితో జతకట్టిన బాబు
బాబు.. ఎన్డీఏలో ఎందుకున్నావో సమాధానం చెప్పే ధైర్యముందా?
బాబు బాగా ముదిరిపోయిన తొండ.. ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీలపై కపట ప్రేమ
ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు
అన్ని మతాల్లో మాదిరిగా.. వెనుకబాటు ప్రాతిపదికగా, రాజ్యాంగానికి లోబడి ఇచ్చినవి
ముస్లింలలోనూ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు
మైనార్టీలకు సంబంధించి ఏ అంశమైనా మీ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు
వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని అందరినీ కోరుతున్నా
ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
హిందూపురం, పలమనేరు, నెల్లూరు సభల్లో సీఎం జగన్
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ! ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో జత కడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూ ఎన్డీఏలో కొనసాగుతానంటాడు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? – నెల్లూరు సభలో సీఎం జగన్
మండుటెండలోనూ పలమనేరులో చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతోపాటు ఈ వర్షం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. విజయం మనదే. – పలమనేరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి నెల్లూరు, సాక్షి, తిరుపతి, సాక్షి, పుట్టపర్తి: ‘నేను ఈరోజు.. ధైర్యంగా చెబుతున్నా. ఆరునూరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెబుతున్నాడు. ఇది మీ జగన్ మాట. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా పోరాడతా. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలడా?
ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? ఎందుకీ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ.. మరోవైపు వాళ్లు 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వారితోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు? సమాధానం చెప్పు చంద్రబాబూ..!’ అని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా నిలదీశారు. శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు.
రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు..
ఇక్కడ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్‌లకు, సయ్యద్‌లకు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు.
ఇవాళ నేను ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని, బీజేపీని అడుగుతున్నా. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు. అన్ని మతాల్లో కూడా బీసీలు, ఓసీలున్నారు. అవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
మైనార్టీలకు మీ జగనన్న భరోసా..
నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడు, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా. మీకు 4 శాతం రిజర్వేషన్ల విషయం అయినా, ఎన్‌ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా.. మీ మనోభావాలకు, ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు. మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీమ్‌లే కాకుండా ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా లాంటి వాటితో అండగా నిలిచాం.
ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నా మైనార్టీ సోదరుడు ఒకరిని డిప్యూటీ సీఎంగా, మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించి గౌరవించాం. మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం దాకా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం కల్పించి సాదరంగా పక్కన పెట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెబుతున్నా.
మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో 7 స్థానాలు మైనార్టీలకే ఇవ్వడం ద్వారా వారికి రాజకీయంగానూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయింది. అలా ఇచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీనే అని గర్వంగా చెబుతున్నా.
ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.
చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఐదేళ్ల పాటు మీ రక్తం తాగుతుంది. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో జమ చేశాడు. గతంలో రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు.
మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నాడు. మీ బిడ్డ ఐదేళ్లలో చేసిన మంచినే చూపిస్తున్నాడు. నలుగురిలో నిలబడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు. ఒక మనిషి 14ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసుండీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా?
మనం చేసిన అభివృద్ధి...
నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తిచేసి జాతికి అంకితం చేసింది మన ప్రభుత్వమే. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి చిత్రావతి, గండికోట, పులిచింతల రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశాం. వెలిగొండలో రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తిచేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకెళుతున్నాం.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పైప్‌లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు చేయి అందించి తోడుగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని వరుసగా నెంబర్ వన్‌గా నిలబెట్టాం.
చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి కావచ్చాయి.
గడగడా చెబుతా
గవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి లాంటివి గతంలో ఉన్నాయా? పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా? నా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగేలా ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం.
అవ్వాతాతలకు ఇంటికే రూ.3,000 పెన్షన్, రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతు భరోసా లాంటివి గతంలో ఉన్నాయా? రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా? సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు, తోడు, లాయర్లకు లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా?
ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా ద్వారా కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా అండగా నిలిచాం. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు ప్రజలకు గడప వద్దే అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయి.
నాడు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లోకెళ్లింది?
పిండి కొద్దీ రొట్టె సామెత మనకు తెలుసు. కానీ,పిండీ.. రొట్టె మొత్తం తినేసే బ్యాచ్‌కు లీడర్ చంద్రబాబు! తన 14 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్కటైనా మంచిపనిగానీ, ఖాతాల్లోకి ఒక్క రూపాయిగానీ జమ చేశాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లో జమ చేశారో నిలదీసి అడగండి. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంతిచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయింది?
మన అభ్యర్థులను దీవించండి
పలమనేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి æదీపికమ్మ, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.
2014లో బాబు ముఖ్యమైన విఫల హామీలివీ..
» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?
» రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?
» ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని నమ్మబలికి రూపాయి అయినా ఇచ్చాడా?
» ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా?
» అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?
» రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశాడా?
» సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా?
» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు.
» మళ్లీ ఇప్పుడు అదే కూటమి పేరుతో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యారు.
ఇంటికే పెన్షన్లను అడ్డుకున్న బాబు..
చంద్రబాబు మొన్న అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పింఛన్‌ను అడ్డుకున్నారు. ఇవాళ బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వలంటీర్లు ఇంటికి రాకూడదు, వాళ్లు పెన్షన్లు ఇవ్వకూడదంటూ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లెటర్ రాశాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్‌పై వేయాలని ప్రయత్నించడం సిగ్గు చేటు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా.
జగనన్న వచ్చాడు.. వర్షాన్ని తెచ్చాడు
హిందూపురంలో పర్యటన ముగించుకుని సీఎం జగన్ పలమనేరు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే క్లాక్ టవర్ వద్దకు జన ప్రవాహం మొదలైంది. అందరిలో హర్షం వెల్లివిరిసేలా సీఎం జగన్‌తో పాటు వరుణ దేవుడు తోడుగా వచ్చాడు. దాదాపు 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. జగన్ వస్తే వానొస్తుందంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment