అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్‌మాన్, బాట్‌మాన్, సూపర్‌మాన్ ఉంటే కేరళకు బోట్‌మాన్ ఉన్నాడని వాట్సాప్‌లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం కేరళ వరద బాధితులకు మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. వరదలు మొదలైన కొన్ని గంటలకే, సైనిక దళాల రాకకు ముందే, చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇక సైన్యం పాత్ర అసాధారణం.
వరద నీటి నుంచి కాపాడిన పసిపాపను చేత్తో ఎత్తి పట్టుకున్న కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పడవలో నిలబడిన దృశ్యం కేరళను అతలాకుతలం చేసిన వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. నీట మునిగిన ప్రజలను రక్షించడానికి రంగంలోకి దిగిన సిబ్బందిని, జనాన్ని సమన్వయం చేయడానికి తన నియోజకవర్గమైన ఆలపూళలో మంత్రి నీటిలోకి వచ్చి సేవలందించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీసుకుంటున్న సహాయ, రక్షణ చర్యల గురించి వివరించడం కూడా నీటితో ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చింది. ఎలాంటి నాటకీయ చర్యలకు తావులేకుండా ప్రశాం తంగా సాగిన ఈ సమావేశాన్ని టెలివిజన్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్నెట్‌లో కూడా వెబ్‌సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం అవసరమైంది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కనిపిస్తూ వరద పరిస్థితులు, సహాయ చర్యలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ప్రజలకు అందించారు.
సహాయ సిబ్బంది కృషి ఆదర్శప్రాయం
కేరళ వరదలపై వస్తున్న నకిలీ ఇంకా చెప్పాలంటే తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకోవడానికి ఈ విధమైన సమాచార ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. రాజధాని తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో, జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. వరద బాధితుల కోసం తీసుకొచ్చిన బియ్యం బస్తాలను వైనాడ్ జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్ లారీ నుంచి దింపి తమ వీపులపై వేసుకుని మోయడం ఉన్నతాధికారుల గొప్ప ప్రవర్తన తార్కాణంగా కనిపిస్తోంది. 1924 తర్వాత కేరళలో ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు రాలేదు. ఈ జల ప్రళయంలో ఇప్పటి వరకూ 300 మందికి పైగా మరణించారు. అయితే, కోట్లాది మందిని కుదిపేస్తున్న ఈ సంక్షోభంలో జరుగుతున్న సహాయక చర్యలపైన, అధికారుల అలసత్వంపైనా ఫిర్యాదులు, విమర్శలు రాకపోవడానికి ఇసాక్, విజయన్, ఇతర అధికారుల కృషే కారణం.
ఈ వరద సహాయక కార్యక్రమాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే, నీట మునిగిన ప్రజలను వరదల నుంచి కాపాడడానికి పాలనా యంత్రాంగంతో పౌర సమాజం చేతులు కలపడం. కేరళ సర్కారు సాయంపై లేనిపోని నిందలేయకుండా తోటి వారికి తోడ్పడాలనే లక్ష్యమే పౌర సమాజాన్ని అద్వితీయమైన చొరవతో ముందుకు నడిపిస్తోంది. ఇలాంటి కష్టకాలాల్లో చీటికి మాటికి ప్రభుత్వంపై వేలెత్తి చూపే ప్రతిపక్షం సైతం తమ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లోకి దింపి ప్రజలకు సాయమందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న జిల్లాల పరిస్థితులను స్వయంగా చూడడానికి ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ పర్యటనల్లో తనతోపాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలను వెంట తీసుకెళ్లారు. వరద సహాయ, రక్షణ చర్యల్లో రాజకీయాలకు తావులేదని చెప్పడమే సీఎం విజయన్ ఉద్దేశం.
మత్స్యకారులు మానవతామూర్తులు
అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్‌మాన్, బాట్‌మాన్, సూపర్‌మాన్ ఉంటే కేరళకు బోట్‌మాన్ ఉన్నాడని వాట్సాప్‌లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. భారీ వర్షా లతో వరదలు మొదలైన కొన్ని గంటలకే సైనిక దళాల రాకకు ముందే చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయపడే కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బంది అందుకు అనువుగా చేతులు లేని చొక్కాలు ధరిస్తారు. అలాంటి దుస్తులు లేకుండానే మత్స్యకారులు రంగంలోకి దిగి నీటము నిగిన కేరళ రహదారుల్లోకి తమ గట్టి బోట్లతో వచ్చి ప్రమాదస్థితిలో ఉన్నవారిని చేరుకుని కాపాడారు.
ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ఈ వరదల్లో స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సైనిక దళాల సేవలు మరువలేనివి. నీటమునుగుతున్న ఇళ్ల పైకప్పులపై నిలబడిన వేలాది మందిని కాపాడిన ఘటనలు చెప్పలేనన్ని ఉన్నాయి. సాజిదా జాబిల్ అనే గర్భిణిని కూడా ఇలాగే రక్షించారు. ప్రసవానికి ముందు ఉమ్మ నీరు రావడంతో ఆమెను కొచ్చి నుంచి ఆస్పత్రికి వేగంగా తరలించారు. కాపాడిన కొన్ని గంటల్లోనే ఆమె మగ బిడ్డను ప్రసవించింది. మూడు రోజుల తర్వాత ఆమెను కాపాడిన ఇంటి పై కప్పు మీద ఆమె కుటుంబ సభ్యులు ‘థ్యాంక్స్’ అని పెద్దక్షరాలతో రాశారు. ఇలాంటి క్షణాలు కేరళ వరద సహాయ కార్యక్రమాల తీరు ఎంత సవ్యంగా, గొప్పగా ఉందో చెబుతున్నాయి.
ఇలాంటి విపత్తుల సమయంలో నాటకీయంగా, అతి వ్యాఖ్యానాలతో వార్తా ప్రసార సాధనాలు పని చేస్తాయి. మలయాళ మీడియా మాత్రం సంయమనం పాటిస్తూ ప్రశంసాపూర్వకంగా వ్యవహరించింది. విలేకరులు, టీవీ యాంకర్లు అతిగా సోది చెప్పకుండా నిజంగా వరద దృశ్యాలు చూపిస్తూ సహాయక చర్యల గురించే వివరించారు. వరద సహాయచర్యల విషయంలో అంకితభావంతో ఏషియానెట్ న్యూస్ చానల్ రెండు రోజులపాటు వార్తల మధ్యలో వ్యాపార ప్రకటనల ప్రసారం కూడా నిలిపివేసింది. విపత్తు సమయంలో అధిక టీఆర్పీలను సొమ్ము చేసుకోకూడదనే ఆశయంతో ఈ పని చేసింది. వరదల వల్ల సొంతిళ్లు వదిలి వచ్చిన కనీసం ఒక కుటుంబానికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలని కోరుతూ టీవీ చానల్ న్యూస్18 ‘ఓపెన్ యువర్ హార్ట్, ఓపెన్ యువర్ హౌస్’(మీ హృదయం తలుపులు, ఇంటి తలుపులు తెరవండి) అనే పిలుపుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం సోమవారం ప్రత్యక్ష ప్రసారమైన సమయంలో ఈ చానల్‌కు 90 ఫోన్ కాల్స్ వచ్చాయి. టీవీ విలేకరులు సొంత కబుర్లతో ఊదరగొట్టకుండా చూపించాల్సిన దృశ్యాలతో అవసరమైన మాటలే చెప్పారు. అనేకమంది జర్నలిస్టులు సొంత సమస్యలు, విషయాలు పక్కన పెట్టి తమ విధులకే ప్రాధాన్యమిచ్చారు. వారి ఇళ్లు లేదా బంధువుల గృహాలు నీటి మునిగి ఉన్నా వాటి గురించి పట్టించుకునే తీరిక వారికి లేదు. జనానికి సేవలందించడానికే వారు అంకితమయ్యారు.
అవాంఛనీయ ధోర ణులకూ కొదవ లేదు!
అయితే, కేరళ వరదల సమయంలో కొన్ని అవాంఛనీయ ధోరణులూ కనిపించాయి. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలివ్వద్దని కోరుతూ సోషల్ మీడియాలో ప్రజలను కోరడంతో ఈ దుష్ప్రచారం మొదలైంది. సర్కారుకు ఇచ్చే సొమ్ము వరద బాధితులకు చేరదనీ, దాన్ని సక్రమంగా ఖర్చు చేయరనే నిందను ఈ రూపేణా ప్రచారం చేశారు కొందరు. అందుకే ఇతర ప్రైవేటు సహాయనిధులకు విరాళాలివ్వాలని వారు కోరుతూ రాష్ట్ర సర్కారు నిజాయితీని అనుమానించేలా ప్రయత్నించారు. క్రైస్తవ, ముస్లిం సంస్థలు తమ వర్గం ప్రజలకు ఎలాగూ సాయం చేస్తాయి కాబట్టి హిందువులకు మాత్రమే తోడ్పాటు అందించాలనే ప్రయత్నాలు జరిగాయి. మలయాళీలు గొడ్డుమాంసం తింటారు కాబట్టే వారికి ఇంతటి కష్టమొచ్చి పడిందనే ప్రచారాన్ని కూడా కొందరు చేశారు. హిందువులకు కీడుచేసే ప్రయత్నాలు, ఆవును పవిత్రంగా చూడకపోవడం వల్లే కేరళను వరదలు ముంచెత్తాయనే ప్రచారం కూడా చేశారు. 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు శబరిమల అయ్యప్ప స్వామి గుడిలోకి ప్రవేశం కల్పించే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపు తున్న విషయం తెలిసిందే. ఈ కోర్టు పరిణామాలపై ఆయ్యప్పకు కోపమొచ్చిందనే సిద్ధాంతాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు.
రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా కొత్తగా నియమితులైన ఎస్.గురుమూర్తి కేరళ వరదలకు అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశానికి ముడిపెడుతూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణకూ, భారీ వర్షాలకు మధ్య ఏదైనా సంబంధం ఉన్నదీ లేనిదీ సుప్రీంకోర్టు జడ్జీలు పరిశీలించాలని ఆయన తన ట్వీట్ల ద్వారా సూచించారు. వరదల కారణంగా ఇతర ప్రదేశాల మాదిరిగానే శబరిమలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ‘‘ఒక వేళ రెంటికీ మధ్య పది లక్షల్లో ఒక అవకాశం ఉన్నా స్త్రీల ప్రవేశానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వాలనే ప్రజలు కోరుకుంటున్నట్టు భావించాలి’’ అని గురుమూర్తి తన ట్వీట్‌లో చెప్పారు.
ఒకవేళ కోర్టు విచారణపై అయ్యప్ప స్వామి తన ఆగ్రహం వరదల ద్వారా వ్యక్తం చేశారని భావించినా, ఆయన పది నుంచి 50 ఏళ్ల వయసు మహిళలే ఈ జల విలయంలో బాధపడేలా చేసి ఉండేవారని నేను అనుకుం టున్నాను. పాత సంప్రదాయం కొనసాగించాలని కోరే పురుషులను వరద బాధితులను చేసేవారు కాదని నమ్ముతున్నాను. అయ్యప్ప సుప్రీంకోర్టు విచారణను జాగ్రత్తగా గమనిస్తున్నారని, స్త్రీల ప్రవేశం కోరుతున్న లక్షలాది మంది కేరళ ప్రజలపై కక్ష సాధించాలని ఆయన వ్యవహరించారని మనం నమ్మాలా? మత విద్వేషంతో నిండిన మితవాదులు కోట్లాది మందికి ఆరాధ్యదైవాన్ని తమ మాదిరిగానే ప్రతీకారం కోరుకునే వాడిగా చిత్రించినట్టు మనకు ఈ పరిణామాలను బట్టి అర్థమౌతోంది. తమ దేశ విజయగాథలో కేరళ ప్రజలు ఎప్పుడూ భాగస్వాములని దుబాయ్ ఉపాధ్యక్షుడు, పాలకుడు షేక్ మహ్మద్ అల్ మక్తూం మలయాళం, ఇంగ్లిష్, అరబిక్ భాషల్లో ట్వీట్ చేస్తూ, కేరళ వరద సాయం కింద రూ.700 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కేరళకు నేడు ఆపన్న హస్తం అవసరం. దుష్ప్రచారం కాదు.
- టీఎస్ సుధీర్
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)
ఈ–మెయిల్ : tssmedia10@gmail.com
మహావిపత్తులోనూ మానవీయత
Published Wed, Aug 22 2018 12:18 AM | Last Updated on Wed, Aug 22 2018 4:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment