ప్రజాయుద్ధమూ–ప్రజాస్వామ్యమూ! | TS Sudhir Article On Gaddar New Journey | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 1:05 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

TS Sudhir Article On Gaddar New Journey - Sakshi

భారత ప్రజాస్వామ్యం పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే, ఎన్ని లోపాలున్నాగాని ప్రగతి, సామాజిక సమానత్వం సాధించడానికి ప్రజాస్వామ్యమే ఏకైక మార్గమనే అవగాహన ఏర్పడిందని గద్దర్‌ ఢిల్లీ సమావేశం చెబుతోంది. గత నాలుగేళ్లలో తెలంగాణలో అధికారం ఒక కులానికి బదులు మరో కులానికి దక్కిందని, దీని వల్ల బడుగు వర్గాలకు మేలేమీ జరగలేదని గద్దర్‌ చెబుతున్నారు. గద్దర్‌ వాదనలో నిజం ఎంత ఉందో తేల్చడం కష్టమే. కాని, నక్సల్‌ సిద్ధాంతాలు నమ్మిన ఓ అగ్రశ్రేణి ప్రచారకుడు బలహీన వర్గాల సాధికారతకు, వారికి ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ చట్టసభకు వెళ్లాలనుకోవడం నిజంగా గొప్ప పరిణామం.

గద్దర్‌గా అందరికీ తెలిసిన గుమ్మడి విఠల్‌ రావు జూలైలో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఓటరుగా తన పేరు నమోదుచేయించుకున్నారు. 69 ఏళ్ల గద్దర్‌ ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఓటువేయలేదు. ఈ ప్రజా గాయకునికి గతంలో పూర్వపు నక్సల్‌ పార్టీ పీపుల్స్‌వార్‌తో అనుబంధం ఉన్నందున ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. గజ్వేలులో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై పోటీకి సిద్ధమేనని గద్దర్‌ ఇప్పుడు చెబుతున్నారు. రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుందిగాని ఈవీఎం ద్వారా కాదన్నది మావోయిస్టుల నమ్మకం. కాబట్టి ఎన్నికల్లో పోటీచేయాలన్న నిర్ణయం కొత్త మార్గంలో పయనించడం కాదా? అని ఆయనను ప్రశ్నించాను. మావోయిస్టులతో కలిసి ఉన్నంత కాలం ఎన్ని కలు బహిష్కరించాలన్న వారి పిలుపునకు గద్దర్‌ మద్దతు పలికేవారు. ‘‘ఇది ‘యూటర్న్‌’ కాదు. ఇది ముందడుగు కిందే లెక్క. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని నేను అప్పట్లో కోరాను. అది కూడా యూ టర్న్‌  అవుతుందా?’’అని గద్దర్‌ ప్రశ్నించారు. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మంచిర్యాల బొగ్గు గనుల ప్రాంతంలో నివసించే ప్రజలను మావోయిస్టులు ఈ వారాంతంలో ఓ ప్రకటనలో కోరారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలూ అవకాశవాద సంస్థలనీ, వాటిని ఈ ప్రాంతంలో ప్రచారం చేయ నీయబోమని మావోయిస్టులు ప్రకటించారు. కిందటి నెలలో అరకు ఎమ్మెల్యే సహా ఇద్దరు తెలుగుదేశం నేతలను ఆంధ్రా– ఒడిశా సరిహద్దు జోన్‌(ఏఓబీ) మావోయిస్టులు కాల్చిచంపారు.

మావోయిస్టుల పంథాకు అద్దంపడుతున్న ఘటనలు
అయితే, ఈ మూడు సంఘటనలకూ ప్రత్యక్ష సంబంధం లేదు. కాని, మావోయిస్టుల ధోరణి వీటిని బట్టి అర్థమౌతుంది. దశాబ్దం కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రాంతాల్లో మావోయిస్టుల ఆధిపత్యం ఉండేది. వారి మాట నడిచేది. తెలంగాణలోని చాలా ప్రాంతం, గుంటూరు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాలు, ఏఓబీ ప్రాంతాలను మావోయిస్టుల ప్రాంతంగా పరిగణించేవారు. రాజకీయ నేతలను నక్స లైట్లు సునాయాసంగా చంపేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడుపై సైతం ‘వార్‌’ నక్సల్స్‌ హత్యాయత్నం చేశారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ అనేక ప్రాంతాల్లో గోడలపై వారు అంటించిన పోస్టర్లలోని విషయాలను జనం సీరియస్‌గా పట్టించుకునే వారు. ఎక్కడేం జరుగుతున్నదీ వారికి చెప్పే వ్యక్తులు అనేక గ్రామాల్లో ఉండేవారు. అయితే, వారంతా కేవలం నక్సలైట్లంటే అభిమానంతోనే అలా వ్యవహరించలేదు. ఇలాంటి ప్రదేశాల్లో అత్యధిక ప్రజానీకం ఓ వైపు పోలీసులు, మరో వైపు నక్సలైట్ల తుపాకుల మధ్య చిక్కుకుపోయి నివసించేవారు. ఏం చేసినా ఇద్దరి నుంచి ముప్పు అని భయపడేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అంటే 2004– 2006 మధ్య కాలంలో చాకచక్యంగా నక్సల్‌ ఉద్యమాన్ని అదుపుచేశారు. ఫలితంగా తెలుగు ప్రాంతాల్లో గడచిన పదేళ్లలో మావోయిస్టుల ప్రాబ ల్యం బాగా తగ్గిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో మావోయి స్టులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. వారిలో కొందరైతే రాజకీయ ప్రధానస్రవంతిలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే మావోయిస్టుల ప్రాబల్యం, పెత్తనం పెరుగుతుందనే భయంతో కొందరు రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయితే, తెలంగాణ వచ్చాక పోలీసులు నక్సౖలñ ట్లను అదుపులో పెట్టగలిగారు.

గద్దర్‌ నిర్ణయం మంచిదే!
2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాలంలో మావోయిస్టుల విషయానికి వస్తే పరిస్థితి మారిపోయినట్టు నాకు కనిపిస్తోంది. ఎన్నికలు బహిష్క రించాలని సీపీఐ(మావోయిస్టు) పిలుపు ఇవ్వడమంటే నేడు ఈ పార్టీకి కొత్త ఆలోచనలేవీ లేవనీ, అతి కష్టం మీద ముందుకు నెట్టుకొస్తోందని స్పష్టమౌతోంది. మావోయిస్టులవి నేటి పరిస్థితులకు సరిపోని కాలం చెల్లిన అభిప్రాయాలు. ప్రజలను ఓటేయవద్దని ఒత్తిడి తేవాలన్న మావో యిస్టుల నిర్ణయం చూస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా మారడా నికి వారు సిద్ధంగా లేరని అర్థమౌతోంది. వాస్తవానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మావోయిస్టులకు తెలియడం లేదు. ఈ కారణాల వల్ల ఎన్నికల రాజకీయాల్లోకి దిగాలన్న గద్దర్‌ నిర్ణయం స్వాగతించ దగ్గది. కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజానికి ప్రచార కర్తగా ఉపయోగపడిన గద్దర్‌ ఇలా మారడం మంచిదే. 1970ల ఆరం భంలో ఉద్యమానికి బాసటగా అవతరించిన జననాట్య మండలిలో భాగమైన గద్దర్‌ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతు అయ్యారు. నక్సల్‌ ఉద్యమం బలం పుంజుకుంటున్న కాలంలో వ్యవ సాయసంక్షోభంలో చిక్కుకున్న జనం కష్టాలను గద్దర్‌ తన పాటల ద్వారా వినిపించారు. చొక్కా లేకుండా గొంగళి పైన కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి వీధుల్లో గద్దర్‌ ఆటపాటలు లక్షలాది మందిని ఆకట్టుకున్నాయి. తెలంగాణలో కులం పేరుతో సాగిన అణచివేతను ఆయన పాటలు కళ్లకు కట్టిచెప్పేవి. అణచివేత, దోపిడీ బాధితులను తమ వైపు తిప్పుకోవడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నాలకు గద్దర్‌ ఉపయోగపడ్డారు. ‘‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి’’ అని గద్దర్‌ రాసి పాడిన పాటలు అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్‌ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టడానికి స్ఫూర్తినిచ్చాయి. ఇలా కొద్ది కాలంలోనే గద్దర్‌కు మంచి పేరొచ్చింది. 1980లలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌ నాయకత్వంతో విభేదాలు రావడంతో 1990ల చివర్లో గద్దర్‌ను నక్సల్‌ పార్టీ నాయకత్వం సస్పెండ్‌ చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి చంద్రబాబు ప్రభు త్వంతో చర్చలకు సన్నాహాలు చేయడానికి 2002లో గద్దర్‌ను దూతగా పంపడానికి వార్‌ నాయకత్వం ఎంపిక చేసింది.

20 ఏళ్ల నుంచీ వెన్నులోనే బులెట్‌!
1997 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న గద్దర్‌పై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అప్పుడు దిగిన ఓ బులెట్‌ ఇంకా గద్దర్‌ వెన్నుల్లోనే ఉంది. ఆంధ్రా పోలీసుల ప్రోద్బలంతోనే తనపై ఈ దాడి జరిగిందని గద్దర్‌ ఎప్పుడూ చెబుతారు. అత్యధిక గుర్తింపు ఉన్న నక్సలైట్ల సానుభూతిపరుడిని చంపే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని చెప్పుకోవడానికే పోలీసులు తనపై హత్యాయత్నం చేయించారనేది గద్దర్‌ ఆరోపణ. అయితే పోలీసులు దీన్ని అంగీకరించరు. కాల్పులు జరిగి రెండు దశాబ్దాలు దాటినా ఈ కేసులో ఒక్కరినీ అరెస్టు చేయలేదని గద్దర్‌ అంటున్నారు. ఈ హత్యాయత్నంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ గద్దర్‌ భార్య ఈ ఏడాది ఆరంభంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి భవన్‌ ఈ లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) పంపగా, పీఎంఓ తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. ఈ కేసు గురించి స్వయంగా వివరించే అవకాశం ఇవ్వా లంటూ మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్‌కు గద్దర్‌ విడిగా ఉత్తరం రాశారు. అయితే, గద్దర్‌కు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇంకా ఇవ్వలేదు. 

సోనియా, రాహుల్‌తో భేటీకి విపరీత ప్రచారం
కిందటివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని గద్దర్‌ ఢిల్లీలో కలుసుకున్నారు. అయితే నేను ఈ పరి ణామాన్ని తెలంగాణ లేదా కాంగ్రెస్‌ రాజకీయాల కోణం నుంచి మాత్రమే చూడటం లేదు. కాంగ్రెస్‌ను నడుపుతున్న ఈ తల్లీకొడుకు లిద్దరితో దిగిన ఫొటోలకు తెలంగాణ సరిహద్దులు దాటి లభించిన ప్రచారం లభించింది. గద్దర్‌ కేసీఆర్‌పై పోటీచేసినా చేయకపోయినా ఇది వాస్తవం. ఈ భేటీ అందరికీ తెలిసిన మాజీ మావోయిస్టులో వచ్చిన మార్పుకు అద్దంపడుతోంది. భారత ప్రజాస్వామ్యం పండుగ చేసుకోవా ల్సిన సమయం ఇది. ఎందుకంటే, ఎన్ని లోపాలున్నాగాని ప్రగతి, సామాజిక సమానత్వం సాధించడానికి ప్రజాస్వామ్యమే ఏకైక మార్గ మనే అవగాహన ఏర్పడిందనడానికి గద్దర్‌ ఢిల్లీ సమావేశం చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరు కేవలం రాష్ట్ర ప్రతిపత్తి కోసమే కాదని ఉద్యమకాలంలోనే గద్దర్‌ చెప్పారు. సమానత్వం సాధించడానికే ఇది ఎక్కువ ఉపయోగపడాలనేది ఆయన విశ్వాసం. గత నాలుగేళ్లలో తెలం గాణలో అధికారం ఒక కులానికి బదులు మరో కులానికి దక్కిందని, దీని వల్ల బడుగు వర్గాలకు మేలేమీ జరగలేదని గద్దర్‌ చెబుతున్నారు. గద్దర్‌ వాదనలో నిజం ఎంత ఉందో తేల్చడం కష్టమే. కాని, నక్సల్‌ సిద్ధాంతాలు నమ్మిన ఓ అగ్రశ్రేణి ప్రచారకుడు బలహీన వర్గాల సాధి కారతకు వారికి ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ చట్టసభకు వెళ్లాలనుకోవడం నిజంగా గొప్ప పరిణామం. 2017లోనే మావోయి స్టులతో గద్దర్‌ తెగతెంపులు చేసుకున్నారు. అర్బన్‌ నక్సల్‌ అనే కొత్త మాట ప్రచారంలోకి వచ్చిన ఈ సమయంలో బలహీనవర్గాల భాషతో జాతీయస్థాయి రాజకీయ చర్చ నాణ్యతను గద్దర్‌ పెంచాలని నేను భావిస్తున్నాను. ఇలాంటి నేతలను ‘నవ నక్సల్స్‌’ అని పిలవవచ్చు. వారి వల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

ఒక సంభాషణలో గద్దర్‌ నాతో ఒక పాత జ్ఞాపకాన్ని  పంచు కున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ గద్దర్‌తో మాట్లాడుతూ అతడు ‘‘మానసికంగా సాయుధుడు’’ అనీ, ఎందుకంటే తన పాటలతో జనాన్ని  ఆయుధాలు చేపట్టాల్సిందిగా రెచ్చగొడుతున్నాడని పేర్కొన్నారట. అయితే అలాంటి వ్యక్తులు భగవద్గీతను చదవాలన్నది గద్దర్‌ వాదన. ఎందుకంటే కృష్ణ భగవానుడు కూడా మానసిక సాయుధుడే  మరి.

హిందీలో అత్యంత ప్రాచుర్యం పొందిన గద్దర్‌ పాటల్లో ఒకటి – ఆగ్‌ హై ఏ ఆగ్‌ హై, ఏ భూక్‌ పెట్‌ కే ఆగ్‌ హై  (ఇది కాలే కడుపుల మంటరా). నక్సల్‌ ఇలా తిరిగి రావడాన్ని కూడా నేను దట్టించిన కొత్త జ్వాలగానే  చూస్తున్నాను.


టీఎస్‌ సుధీర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు (tssmedia10@gmail.com)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement