
మిస్సయిన మహిళ ప్రియునితో షికారు
కొడగు జిల్లాలో అనూహ్య ఘటన
అప్పట్లో భర్తను జైలుకు పంపిన అత్త
కర్ణాటక: భార్య అదృశ్యమైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. మా కూతురిని హత్య చేశాడంటూ అనుమానంతో అత్తంటివారు ఫిర్యాదు చేయటంతో భర్తను కేసు పెట్టి జైలుకు పంపారు. ఎలానో శిక్ష నుంచి బయట పడ్డారు. ఇదీ కథ కాదు. ఐదేళ్లు క్రితం జరిగిన యద్దార్థ ఘటన. ఇప్పుడు ఆ భార్య ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. ఈ విచిత్ర సంఘటన కొడగు జిల్లా కుశాలనగర తాలూకా బసవనహళ్లి గ్రామంలో జరిగింది.
ఓ రోజు మిస్సింగ్
కుశాలనగర తాలూకా బసవనహళ్లికి చెందిన సురేశ్, మల్లిగె దంపతులు కూలిపని చేసుకుని జీవిస్తుండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక రోజు మల్లిగె అదృశ్యమైంది. ఆమె ఆక్రమ సంబంధం కారణంగా వెళ్లిపోయిందని భర్త చెప్పేవాడు. ఓ రోజు మల్లిగెకి ఫోన్ చేసి నాతో సంసారం చేయకున్నా పర్వాలేదు. ఇద్దరు పిల్లలున్నారు. చూసుకోవడానికైనా రావాలని మల్లిగెని ప్రాధేయ పడ్డాడు. ఆమె మనసు కరగలేదు. చివరికి సురేశ్ 2021లో కుశాలనగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు.
2022లో శవం లభ్యం
2022లో సురేశ్‌కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లు సమాచారం ఇచ్చారు. పిరియాపట్టణ పోలీసులు సురేశ్‌తో పాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించగా ఇది మల్లిగెది అని గుర్తించారు. అక్కడే అంత్యసంస్కారంను పూర్తి చేయించారు. తన అల్లుడే ఆమెను చంపాడని అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండేళ్లు తరువాత డీఎన్‌ఎ పరీక్షల రిపోర్ట్ రాగా, ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్ జైలు నుంచి బయట పడ్డారు.
ఇలా దొరికింది
ఇలా ఉండగా మల్లిగె ఈ నెల 1ను తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఒక హోటల్‌కు వెళ్లింది. అక్కడ సురేశ్ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్‌కు, పోలీసులకు పంపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తను ప్రియునితో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజర్ పరిచి మైసూరు జైలుకు తరలించారు. అప్పట్లో లభించిన శవం ఎవరిది, అన్యాయంగా సురేశ్‌ను జైలుకు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి.