‘అయోధ్య’ పరిష్కారానికి మధ్యవర్తిత్వం | Supreme Court To Pass Order On Ayodhya Case On 5th March | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’ పరిష్కారానికి మధ్యవర్తిత్వం

Published Wed, Feb 27 2019 2:56 AM | Last Updated on Wed, Feb 27 2019 10:39 AM

Supreme Court To Pass Order On Ayodhya Case On 5th March - Sakshi

అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ అంశంపై మార్చి 5న తుది నిర్ణయం వెలువరించనున్నట్లు పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదం కేసు మరో కీలక మలుపు తిరిగింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై మార్చి 5వ తేదీ న తుది నిర్ణయం వెలువరించనున్నట్లు పేర్కొం ది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఈ సమస్యకు మధ్యవర్తిత్వంతో పరిష్కారం దొరికే అవకాశం ఒక్క శాతం మేర ఉన్నా ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

ఈ వివాదానికి ముగింపు పలకడం ద్వారా సమాజంలో సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాం. ఈ కేసుకు సం బంధించిన అన్ని పత్రాలను ఆరు వారాల్లోగా తర్జుమా చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. 8 వారాల తర్వాత ఈ అంశంపై వాదనలు ప్రారంభిస్తాం’అని ధర్మాసనం పేర్కొంది. ఆలోగా ఇరుపక్షాల వారు తర్జుమా చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైతే అభ్యంతరాలను వ్యక్తపరచవచ్చని తెలిపింది. ఈ ఎనిమిది వారాల సమయంలో మధ్యవర్తిని నియమించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని వివరించింది. అయితే, మధ్యవర్తిత్వా న్ని కొన్ని ముస్లిం సంస్థలు సానుకూలత తెలుపగా రామ్‌లల్లా సంస్థ వ్యతిరేకించింది.

తర్జుమాకు కనీసం నాలుగు నెలలు
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ అయోధ్య భూ వివాదానికి సంబంధించిన పత్రాలపై ధర్మాసనానికి ఒక నివేదిక సమర్పించారు. దీని ప్రకారం.. అయోధ్య భూ వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతోపాటు ఇతర దస్త్రాలన్నీ కలిపి 15 ట్రంకుపెట్టెల్లో భద్రపరిచి ఉన్నాయి. ఇవి మొత్తం 38,147 పేజీలు కాగా, అందులో 12,814 పేజీలు హిందీలోను, 18,607 పేజీలు ఇంగ్లిష్‌లో, 501 పేజీలు ఉర్దూ, 97 పేజీలు పంజాబీ, 21 పేజీలు సంస్కృతం, 86 పేజీలు ఇతర భాషల్లో ఉన్నాయి. 14 పేజీల్లో చిత్రాలు, 1,729 పేజీల్లో ఒకటి కంటే ఎక్కువ భాషలున్నాయి. ఇందులో ఇంగ్లిష్‌లోని 11,479 పేజీలను 16 భాషల్లోకి తర్జుమా చేయాల్సి ఉండగా వీటి కోసం అందుబాటులో ఉన్న 8 మంది అనువాదకులను పురమాయించినా పని పూర్తయ్యేందుకు 120 రోజుల సమయం పడుతుందని సెక్రటరీ జనరల్‌ వివరించారు.

ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, వాటిపై ఇరుపక్షాలు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. అయితే, తాము యూపీ ప్రభుత్వం సమర్పించిన పత్రాలను చదవలేదని వాస్తవ కక్షిదారు ఎం.సిద్దిఖి తరఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. దస్త్రౠల తర్జుమాపై అన్ని పక్షాలు సానుకూలత వ్యక్తం చేస్తేనే విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఒకసారి విచారణ మొదలయ్యాక తర్జుమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కుదరదని పేర్కొంది.

మధ్యవర్తిత్వంపై భిన్నాభిప్రాయం
అయోధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలన్న అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు సానుకూలంగా స్పందించాయి. అయితే, గతంలో ఇలాంటివి విఫలమయ్యాయని, మళ్లీ మధ్యవర్తిత్వం వద్దంటూ రామ్‌లల్లా విరాజమాన్‌ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన ఈ అంశం తాము నియ మించే మధ్యవర్తి సాయంతో పరిష్కారమయ్యే ఒక్క శాతం అవకాశమున్నా వదులుకోబోమని తెలిపిన ధర్మాసనం..అందుకు గల అవకాశాలుంటే తెలపాలని ఆయా పక్షాలను కోరింది.

‘ఇన్నేళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారం కేవలం ఆస్తి తగాదాయేనని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఆ ఆస్తిపై ఎవరికి హక్కులుంటాయనేది నిర్ణయించడంతోపాటు ఆ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం’అని ధర్మాసనం వివరించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌ లల్లా సంస్థలకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement