
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మస్థలంగా భావిస్తున్న ప్రాంతాన్ని వ్యక్తిగా భావించి.. కక్షిదారుడిగా ఎలా పరిగణిస్తామని సుప్రీంకోర్టు ‘రామ్ లల్లా విరాజ్‌మాన్’అనే హిందూ సంస్థను ప్రశ్నించింది. దేవతల విగ్రహాలకైతే ఆస్తులు, ఆభరణాలు ఉండటంతో చట్టపరంగా వాటిని వ్యక్తులుగా భావిస్తామని.. మరి జన్మస్థలాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామని ప్రశ్నించింది. అయోధ్య కేసు రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం హిందూ, ముస్లిం పార్టీల వాదనలు వింది. రామ్ లల్లా తరఫున సీనియర్ న్యాయవాది పరాశరణ్ వాదనలు వినిపించారు.
హిందూ మతంలో విగ్రహాలను మాత్రమే పూజించాలనే నియమం లేదని.. నదులను, సూర్యుడిని కూడా పూజిస్తారని తెలిపారు. భగవంతుడు పుట్టిన స్థలాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారని కోర్టుకు తెలిపారు. జన్మస్థలం ప్రాముఖ్యతను వివరిస్తూ సంస్కృతంలో ఉద్దేశించిన ఓ శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’అనే శ్లోకంలో జన్మస్థలం స్వర్గం కంటే గొప్పదని పేర్కొన్నారని.. ఈ నేపథ్యంలో జన్మస్థలాన్ని కక్షిదారుడిగా భావించవచ్చని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. పవిత్ర గంగా నదిని కక్షిదారుడిగా భావించవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును ప్రస్తావించింది. 1949 డిసెంబర్ 16 నుంచి ముస్లింలు ఈ ప్రాంతంలో ప్రార్థనలు చేయడం లేదని నిర్మోహ అఖాడా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి వాదనలను శుక్రవారం వింటామని కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment