దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువులు, సన్యాసుల రూపంలో నేరస్తులు రాజ్యమేలుతున్న అయోధ్యలో పవిత్రత నశించిపోతోంది. కానీ రామమందిర ఉద్యమం, దానిచుట్టూ నడుస్తున్న రాజకీయాలు ఏవీ అయోధ్యలో వారసత్వంగా వస్తున్న భక్తి, శాంతిని ధ్వంసం చేయలేకపోయాయి. ముక్తిగాములై ఆశ్రయం పొందగోరి వచ్చిన, ఆధ్యాత్మికత తప్ప మరేమీ ఎరుగని ప్రజల నివాస ప్రాంతంనుంచి హిందూ ఓటు బ్యాంకును సృష్టించే రాజకీయ ఉద్యమానికి ప్రయోగ స్థలంగా అయోధ్య ప్రస్తుతం రూపాంతరం చెందింది. మందిర్–మసీద్ వివాదానికి న్యాయపరిష్కారం సమీపిస్తున్న తరుణంలో మసీదు కూల్చివేత సందర్భంగా నమోదు చేసిన కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ తరహాలో విచారించి తీర్పు చెప్పడం అవసరం. ముస్లింలలో తమకూ న్యాయం జరిగిందనే సంతోషాన్ని కల్పించే బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీదే ఉంది.
హిందూ మతతత్వవాదులు బాబ్రీమసీదులో రామ్ లల్లా విగ్రహాన్ని నిర్బంధంగా స్థాపించి 25,500 రోజులు దాటాయి. విశ్వహిందూ పరిషత్ మత ప్రచారాన్ని కౌగలించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ మసీదును తిరిగి తెరిచి హిందువులు అక్కడ పూజలు జరుపుకునేలా రాజకీయం చేసి 30 సంవత్సరాలకు పైబడింది. మధ్యయుగాలకు చెందిన బాబ్రీమసీదును కూలగొట్టిన సందర్భంగా హిందూ ముస్లింల మధ్య రక్తపాత దాడుల నేప«థ్యంలో దేశ సామాజిక చట్రమే కుప్పగూలిపోయి దాదాపు 27 సంవత్సరాలు కావస్తోంది. ఇంత సుదీర్ఘ కాలం విరామం తర్వాత సుప్రీంకోర్టు ఈ లీగల్ కేసులో తుది తీర్పును మరికొన్ని రోజుల్లో వెలువరించనుందని వింటున్నాం.
అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం గురించిన పతాక శీర్షికల వెనుక ఎలాంటి ప్రత్యేకతా లేకుండా సాధారణంగా కనిపించే అయోధ్యలో తరాలుగా నడుస్తున్న ఈ వివాదానికి తెరపడే క్షణాల కోసం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇక అసంఖ్యాక హిందువుల దృష్టిలో, శ్రీరాముడు జన్మించిన స్థలంగా భావిస్తున్న అయోధ్యపై తమ హక్కును సాధించేందుకోసం దశాబ్దాలుగా కాకుంటే శతాబ్దాలుగా సాగిస్తున్న పోరాటానికి మంగళం పలుకుతున్న క్షణాలివి.
ఇటీవలి సంవత్సరాల్లో తాము ముట్టడికి గురైన భావన పెరుగుతున్న ముస్లింల విషయానికి వస్తే, ఇదొక బాధాకరమైన, భ్రష్ట అధ్యాయం ముగింపుకొస్తున్న క్షణంగా కనిపిస్తోంది. వాస్తవానికి హిందూ మెజారిటీ తత్వం నుంచి పొంచి ఉన్న ప్రమాదం తీవ్రతను గుర్తించిన కొందరు పదవీ విరమణ చేసిన ముస్లిం మేధావులు ఒక బహిరంగ సభను నిర్వహించి అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ‘కానుక’గా ఇచ్చేయాలంటూ వివాదంలో ముస్లింల పక్షం వహిస్తున్న లీగల్ పార్టీలను కోరారు. ఒకవేళ లీగల్ పోరాటంలో ముస్లింలే గెలిచినప్పటికీ కూల్చివేతకు గురైన స్థలంలో బాబ్రీమసీదును పునర్నిర్మించడం అసాధ్యమని వీరి అభిప్రాయం. దేశ న్యాయవ్యవస్థపై మనకున్న సామూహిక విశ్వాసం గతి ఇదన్నమాట.
వాస్తవానికి, అయోధ్య–బాబ్రీ మసీదు వ్యవహారం మన న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మూక సంకల్పానికి ఎలా తలొగ్గుతాయో తెలిపే పరమోదాహరణంగా నిలుస్తుంది. మొదటిసారిగా 1949లో, తర్వాత 1989లో, అంతిమంగా 1992లో భద్రతా బలగాలు చూస్తుండగానే బాబ్రీ మసీదును నిర్మూలించిన ఘటన న్యాయపాలనపై మూక పాలన ప్రాబల్యానికి తిరుగులేని ఉదాహరణగా నిలుస్తుంది.
అయితే మెజారిటీ అభిప్రాయం రాజ్యమేలుతున్నది వీధుల్లోనే కాదు.. సుప్రీం కోర్టు తుది విచారణగా పేరొందిన ప్రక్రియలో కూడా ఈ తీరే కనిపిస్తోంది. వివాదంలో భాగమైన ముస్లిం పార్టీలు సుప్రీం కోర్టు కూడా పాక్షికత్వంతో ఉంటోందని ఆరోపించాయి. సుప్రీంకోర్టు తుది విచారణ సాగిన 38వ రోజున, ముస్లిం పార్టీల తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ రాజీవ్ ధావన్ అయిదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ముందు ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘న్యాయమూర్తులుగారూ.. మీరు ముస్లిం పక్షాలను తప్పితే ఎదుటి పక్షంపై ప్రశ్నలు సంధించలేదు. అన్ని ప్రశ్నలూ మాకే వేస్తున్నారు. మేం వాటికి జవాబు చెప్పామనుకోండి’’. అయితే ధావన్ వ్యాఖ్యలను రామ్ లల్లా పక్షాన వాదిస్తున్న కౌన్సిల్ వ్యతిరేకించడమే కాకుండా ఇది పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్య అంటూ పేర్కొంది.
అయితే ధావన్ వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఎందుకంటే ఆయా ప్రభుత్వాల మద్దతు తోడుగా భారతదేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యతిరేకతను చవిచూస్తున్న ముస్లింలలో పేరుకుపోయిన భయం, వివక్షతను ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. జాతీయ పౌరసత్వ నమోదు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి లేక ఉత్తర భారతదేశంలో ఆవులను తరలిస్తున్నారని, చంపుతున్నారని అనుమానం వచ్చినంతమాత్రానే జనం వారిని చితకబాది చంపుతున్న వరుస ఘటనలు కానివ్వండి, లేక తమపై ఉగ్రవాద ముద్ర వేయబడిన స్థితిలో మీరు జాతి వ్యతిరేకులు అంటూ మూక ఆరోపిస్తూ కొడుతున్నప్పుడు భారతీయ ముస్లింలు తమ కళ్లను దించుకుని, స్వరం తగ్గించి, తల దించుకుని ఒక అపరాధ భావనతో జీవించాల్సి వస్తోంది.
1990లలో రామ్ మందిర నిర్మాణ ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో, మత వెర్రితో ఊగిపోతున్న వారికి అయోధ్యను హిందూ వాటిక¯Œ గా మార్చాలనే స్వప్నం బలంగా ఉండేది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీమసీదును కూలగొడుతున్నప్పుడు వారి నాయకులు అయోధ్యలో ముస్లింలు, వారి ఇస్లామిక్ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చెరిపివేయాలని మూకలను రెచ్చగొడుతూ కనిపిం చారు. ఫలితం.. డజనుకుపైగా ముస్లింలు దారుణ హత్యకు గురయ్యారు. వారి దేహాలను తగులబెట్టేశారు. ముస్లిం మసీదులు, మజార్లను ధ్వంసం చేశారు. ఈ హత్యాకాండకు పాల్పడిన వారి ఉద్దేశం ఒకటే. ముస్లింలకు, హిందువులకు మాత్రమే కాకుండా జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా పవిత్ర స్థలంగా ఉంటున్న అయోధ్య పట్టణంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా కనిపించకూడదంతే.
బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత దాదాపు మూడు దశాబ్దాలపాటు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల నేతృత్వంలో బీజేపీయేతర ప్రభుత్వం రాజ్యమేలింది. ఈ రెండు పార్టీలూ లౌకికవాదానికి చాంపియన్లు కావడంతో అయోధ్యను హిందూ వాటికన్ సిటీగా మార్చాలనే హిందుత్వవాదుల స్వప్నం సాకారం కాలేదు.
కొంతవరకు ఇరు మతాలూ వేరు చేయబడిన వాతావరణంలో అయోధ్యలో ప్రస్తుతం ముస్లింలు, హిందువులు కలిసి పనిచేసే వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. యాత్రికుల మార్కెట్లో గానీ, మొబైల్స్, ఇతర గాడ్జెట్లు అమ్మే స్టోర్లలో కానీ ఇరు మతాలకు చెందినవారు కలిసి పనిచేస్తున్నట్లు కనబడదు. కానీ వాస్తవానికి అయోధ్య లోని సామాన్యులు భారత్‌లో పరమ నిర్లక్ష్యానికి గురవుతున్నా.. అంతగా అభివృద్ధి చెందని లోతట్టు ప్రాంతాల్లో భాగమైన అయోధ్యలో కొన్ని విషయాల్లో కలిసే జీవిస్తున్నారు. మురికికాలువలు, ఎగుడుదిగుడు గుంతల రోడ్లు, నాసిరకం విద్యా సౌకర్యాలు, ఉద్యోగాల కొరత, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే అవకాశాల లేమి వంటి సాధారణ అంశాల్లో ఇరు మతాల ప్రజలదీ ఒకే తీరుగా ఉంటోంది. ఇక యువత విషయానికి వస్తే అన్ని చిన్న పట్టణాలకు మల్లే అయోధ్యనుంచి పరారై ఏ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహా నగరాలకు తరలి వెళ్లడానికే చూస్తున్నారు.
హిందువైనా, ముస్లిమైనా అయోధ్యలోని సగటు వ్యక్తి వ్యవస్థ పట్ల తీవ్రాతితీవ్రమైన నిస్పృహను కలిగి ఉంటున్నాడు. రాజకీయ నాయకుల పట్ల, కండబలంతో పట్టణంలో దాషీ్టకం చలాయిస్తున్న నకిలీ సాధువుల పట్ల సగటు మనిషిలో వ్యతిరేకత పెరుగుతోంది. సాధువుల ముసుగులో నేరస్తుల ఉపద్రవం కూడా నిరాకరించలేని వాస్తవంగా ఉంటోంది. ఈ దైవసమానులు వారి అనుయాయులూ లైంగికదాడికి ఇతర హింసాత్మక నేరచర్యలకు పాల్పడకుండా ప్రశాం తంగా గడిచిన నెలను అయోధ్య చూడటంలేదు. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువులు, సన్యాసుల రూపంలో నేరగాళ్లు రాజ్యమేలుతున్న అయోధ్యలో పవిత్రత అనేది నశించిపోతోంది. కానీ రామమందిర ఉద్యమం, దానిచుట్టూ నడుస్తున్న రాజకీయాలు ఏవీ అయోధ్యలో వారసత్వంగా వస్తున్న ధర్మపరాయణత్వం, భక్తి, శాంతిని ధ్వంసం చేయలేకపోయాయి. ముక్తిగాములై ఆశ్రయం పొందగోరి వచ్చిన, ఆధ్యాత్మికత తప్ప మరేమీ ఎరుగని ప్రజల నివాస ప్రాంతంనుంచి హిందూ ఓటు బ్యాంకును సృష్టించే రాజకీయ ఉద్యమానికి ప్రయోగ స్థలంగా అయోధ్య ప్రస్తుతం రూపాంతరం చెందింది.
బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం మూడు దశాబ్దాల తర్వాత కూడా ఆలయ నిర్మాణం అనే ఒకేఒక్క అంశం అయోధ్యలో ప్రాబల్య స్థానంలో కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ వివాదానికి న్యాయపరమైన పరిష్కారం తుది అంచుల్లో ఉంటూండగా, మసీదును కూల్చివేసిన సందర్భంగా నమోదు చేసిన కేసులను కూడా ఫాస్ట్–ట్రాక్ ప్రాతిపదికన విచారించి తీర్పు చెప్పడం అవసరం. ముస్లింలలో తమకూ న్యాయం జరిగిందనే సంతోషాన్ని కల్పించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు మీదే ఉంది. అయోధ్య ఏనాడో కోల్పోయిన ధర్మనిష్టను పునరుద్ధరించే మార్గం ఇదొక్కటి మాత్రమే. శ్రీరాముడు ప్రతిపాదించిన, ఆచరించిన న్యాయం, శాంతికి సంబంధించిన విలువలకు నిజమైన నివాళి కూడా ఇదే మరి. ఎందుకంటే శ్రీరాముడి పేరుమీదనే కదా ఇంత చరిత్ర, ఇన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి! (ది వైర్‌తో ప్రత్యేక ఏర్పాటు)
వ్యాసకర్త : వలయ్ సింగ్, జర్నలిస్టు, రచయిత
అయోధ్యలో శాంతి కుసుమించేనా?
Published Thu, Oct 31 2019 12:46 AM | Last Updated on Thu, Oct 31 2019 12:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment