Ayodhya Ram Temple issue
-
ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో ఆ అంశంపైనే ఫోకస్ !
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభల్లో ఈ పదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రధాని ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా ఈ నెలలో 15 రోజులు ఈ పనిమీదే ప్రధాని దృష్టిపెట్టనున్నారు. ఈ వారంతంలో ప్రధాని ఒడిషా,అస్సాంలలో పర్యటించనున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు కాకుండా ప్రధాని తన ప్రసంగాల్లో అయోధ్యలో ఇటీవల జరిగిన రామమందిర ప్రారంభోత్సవ అంశం కంటే ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాజాగా పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రసంగం తర్వాత ఆయన గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా అయోధ్య ప్రస్తావన తీసుకురాలేదు. దీన్ని బట్టి ఆయన ఇక ముందు కూడా తన ప్రసంగాల్లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతున్నారు. అయితే అయోధ్య రామమందిర అంశాన్ని కూడా అవసరమైనపుడు తప్పకుండా ప్రచారంలో వాడుతారని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదీ.. చదవండి.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ -
అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎంపిక
లక్నో: అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ఎంపిక చేశారు. మూడు విగ్రహాల్లో 51 అంగుళాలు ఉన్న రాముని శ్యామవర్ణ(నీలిరంగు) విగ్రహాన్ని ఆలయ కమిటీ ఫైనల్ చేసింది. ఎంపిక చేసిన ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్, కే.ఎల్ భట్లు తయారు చేశారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరిగింది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పించారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన ఇప్పటికే చెప్పారు. ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్ -
'రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం తీసుకుంటాం'
లక్నో: అయోధ్య రామాలయం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే విషయంలో నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ తెలిపారు. ఇందుకోసం ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జిలానీ ఇంకా మాట్లాడుతూ.. ‘మాకు ఐదెకరాలు ఇవ్వాలని సుప్రీ ఇచ్చిన తీర్పుపై మాకు అసంతృప్తి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయమైతే ఐదెకరాలు కాదు. 500 ఎకరాలు ఇచ్చినా సమ్మతం కాదు. మాకు మసీదే కావాలని వ్యాఖ్యానించిన ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో నేను ఏకీభవిస్తా’నని వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ సుప్రీం తీర్పును స్వాగతించారు కదా అని ప్రశ్నించగా, ఆయన చెప్పేదే ఫైనల్ కాదు. అతనిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు. ఇదిలా ఉండగా, అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. -
అయోధ్యలో శాంతి కుసుమించేనా?
దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువులు, సన్యాసుల రూపంలో నేరస్తులు రాజ్యమేలుతున్న అయోధ్యలో పవిత్రత నశించిపోతోంది. కానీ రామమందిర ఉద్యమం, దానిచుట్టూ నడుస్తున్న రాజకీయాలు ఏవీ అయోధ్యలో వారసత్వంగా వస్తున్న భక్తి, శాంతిని ధ్వంసం చేయలేకపోయాయి. ముక్తిగాములై ఆశ్రయం పొందగోరి వచ్చిన, ఆధ్యాత్మికత తప్ప మరేమీ ఎరుగని ప్రజల నివాస ప్రాంతంనుంచి హిందూ ఓటు బ్యాంకును సృష్టించే రాజకీయ ఉద్యమానికి ప్రయోగ స్థలంగా అయోధ్య ప్రస్తుతం రూపాంతరం చెందింది. మందిర్–మసీద్ వివాదానికి న్యాయపరిష్కారం సమీపిస్తున్న తరుణంలో మసీదు కూల్చివేత సందర్భంగా నమోదు చేసిన కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ తరహాలో విచారించి తీర్పు చెప్పడం అవసరం. ముస్లింలలో తమకూ న్యాయం జరిగిందనే సంతోషాన్ని కల్పించే బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీదే ఉంది. హిందూ మతతత్వవాదులు బాబ్రీమసీదులో రామ్ లల్లా విగ్రహాన్ని నిర్బంధంగా స్థాపించి 25,500 రోజులు దాటాయి. విశ్వహిందూ పరిషత్ మత ప్రచారాన్ని కౌగలించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ మసీదును తిరిగి తెరిచి హిందువులు అక్కడ పూజలు జరుపుకునేలా రాజకీయం చేసి 30 సంవత్సరాలకు పైబడింది. మధ్యయుగాలకు చెందిన బాబ్రీమసీదును కూలగొట్టిన సందర్భంగా హిందూ ముస్లింల మధ్య రక్తపాత దాడుల నేప«థ్యంలో దేశ సామాజిక చట్రమే కుప్పగూలిపోయి దాదాపు 27 సంవత్సరాలు కావస్తోంది. ఇంత సుదీర్ఘ కాలం విరామం తర్వాత సుప్రీంకోర్టు ఈ లీగల్ కేసులో తుది తీర్పును మరికొన్ని రోజుల్లో వెలువరించనుందని వింటున్నాం. అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం గురించిన పతాక శీర్షికల వెనుక ఎలాంటి ప్రత్యేకతా లేకుండా సాధారణంగా కనిపించే అయోధ్యలో తరాలుగా నడుస్తున్న ఈ వివాదానికి తెరపడే క్షణాల కోసం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇక అసంఖ్యాక హిందువుల దృష్టిలో, శ్రీరాముడు జన్మించిన స్థలంగా భావిస్తున్న అయోధ్యపై తమ హక్కును సాధించేందుకోసం దశాబ్దాలుగా కాకుంటే శతాబ్దాలుగా సాగిస్తున్న పోరాటానికి మంగళం పలుకుతున్న క్షణాలివి. ఇటీవలి సంవత్సరాల్లో తాము ముట్టడికి గురైన భావన పెరుగుతున్న ముస్లింల విషయానికి వస్తే, ఇదొక బాధాకరమైన, భ్రష్ట అధ్యాయం ముగింపుకొస్తున్న క్షణంగా కనిపిస్తోంది. వాస్తవానికి హిందూ మెజారిటీ తత్వం నుంచి పొంచి ఉన్న ప్రమాదం తీవ్రతను గుర్తించిన కొందరు పదవీ విరమణ చేసిన ముస్లిం మేధావులు ఒక బహిరంగ సభను నిర్వహించి అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ‘కానుక’గా ఇచ్చేయాలంటూ వివాదంలో ముస్లింల పక్షం వహిస్తున్న లీగల్ పార్టీలను కోరారు. ఒకవేళ లీగల్ పోరాటంలో ముస్లింలే గెలిచినప్పటికీ కూల్చివేతకు గురైన స్థలంలో బాబ్రీమసీదును పునర్నిర్మించడం అసాధ్యమని వీరి అభిప్రాయం. దేశ న్యాయవ్యవస్థపై మనకున్న సామూహిక విశ్వాసం గతి ఇదన్నమాట. వాస్తవానికి, అయోధ్య–బాబ్రీ మసీదు వ్యవహారం మన న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మూక సంకల్పానికి ఎలా తలొగ్గుతాయో తెలిపే పరమోదాహరణంగా నిలుస్తుంది. మొదటిసారిగా 1949లో, తర్వాత 1989లో, అంతిమంగా 1992లో భద్రతా బలగాలు చూస్తుండగానే బాబ్రీ మసీదును నిర్మూలించిన ఘటన న్యాయపాలనపై మూక పాలన ప్రాబల్యానికి తిరుగులేని ఉదాహరణగా నిలుస్తుంది. అయితే మెజారిటీ అభిప్రాయం రాజ్యమేలుతున్నది వీధుల్లోనే కాదు.. సుప్రీం కోర్టు తుది విచారణగా పేరొందిన ప్రక్రియలో కూడా ఈ తీరే కనిపిస్తోంది. వివాదంలో భాగమైన ముస్లిం పార్టీలు సుప్రీం కోర్టు కూడా పాక్షికత్వంతో ఉంటోందని ఆరోపించాయి. సుప్రీంకోర్టు తుది విచారణ సాగిన 38వ రోజున, ముస్లిం పార్టీల తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ రాజీవ్ ధావన్ అయిదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ముందు ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘న్యాయమూర్తులుగారూ.. మీరు ముస్లిం పక్షాలను తప్పితే ఎదుటి పక్షంపై ప్రశ్నలు సంధించలేదు. అన్ని ప్రశ్నలూ మాకే వేస్తున్నారు. మేం వాటికి జవాబు చెప్పామనుకోండి’’. అయితే ధావన్ వ్యాఖ్యలను రామ్ లల్లా పక్షాన వాదిస్తున్న కౌన్సిల్ వ్యతిరేకించడమే కాకుండా ఇది పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్య అంటూ పేర్కొంది. అయితే ధావన్ వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఎందుకంటే ఆయా ప్రభుత్వాల మద్దతు తోడుగా భారతదేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యతిరేకతను చవిచూస్తున్న ముస్లింలలో పేరుకుపోయిన భయం, వివక్షతను ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. జాతీయ పౌరసత్వ నమోదు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి లేక ఉత్తర భారతదేశంలో ఆవులను తరలిస్తున్నారని, చంపుతున్నారని అనుమానం వచ్చినంతమాత్రానే జనం వారిని చితకబాది చంపుతున్న వరుస ఘటనలు కానివ్వండి, లేక తమపై ఉగ్రవాద ముద్ర వేయబడిన స్థితిలో మీరు జాతి వ్యతిరేకులు అంటూ మూక ఆరోపిస్తూ కొడుతున్నప్పుడు భారతీయ ముస్లింలు తమ కళ్లను దించుకుని, స్వరం తగ్గించి, తల దించుకుని ఒక అపరాధ భావనతో జీవించాల్సి వస్తోంది. 1990లలో రామ్ మందిర నిర్మాణ ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో, మత వెర్రితో ఊగిపోతున్న వారికి అయోధ్యను హిందూ వాటిక¯Œ గా మార్చాలనే స్వప్నం బలంగా ఉండేది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీమసీదును కూలగొడుతున్నప్పుడు వారి నాయకులు అయోధ్యలో ముస్లింలు, వారి ఇస్లామిక్ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చెరిపివేయాలని మూకలను రెచ్చగొడుతూ కనిపిం చారు. ఫలితం.. డజనుకుపైగా ముస్లింలు దారుణ హత్యకు గురయ్యారు. వారి దేహాలను తగులబెట్టేశారు. ముస్లిం మసీదులు, మజార్లను ధ్వంసం చేశారు. ఈ హత్యాకాండకు పాల్పడిన వారి ఉద్దేశం ఒకటే. ముస్లింలకు, హిందువులకు మాత్రమే కాకుండా జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా పవిత్ర స్థలంగా ఉంటున్న అయోధ్య పట్టణంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా కనిపించకూడదంతే. బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత దాదాపు మూడు దశాబ్దాలపాటు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల నేతృత్వంలో బీజేపీయేతర ప్రభుత్వం రాజ్యమేలింది. ఈ రెండు పార్టీలూ లౌకికవాదానికి చాంపియన్లు కావడంతో అయోధ్యను హిందూ వాటికన్ సిటీగా మార్చాలనే హిందుత్వవాదుల స్వప్నం సాకారం కాలేదు. కొంతవరకు ఇరు మతాలూ వేరు చేయబడిన వాతావరణంలో అయోధ్యలో ప్రస్తుతం ముస్లింలు, హిందువులు కలిసి పనిచేసే వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. యాత్రికుల మార్కెట్లో గానీ, మొబైల్స్, ఇతర గాడ్జెట్లు అమ్మే స్టోర్లలో కానీ ఇరు మతాలకు చెందినవారు కలిసి పనిచేస్తున్నట్లు కనబడదు. కానీ వాస్తవానికి అయోధ్య లోని సామాన్యులు భారత్‌లో పరమ నిర్లక్ష్యానికి గురవుతున్నా.. అంతగా అభివృద్ధి చెందని లోతట్టు ప్రాంతాల్లో భాగమైన అయోధ్యలో కొన్ని విషయాల్లో కలిసే జీవిస్తున్నారు. మురికికాలువలు, ఎగుడుదిగుడు గుంతల రోడ్లు, నాసిరకం విద్యా సౌకర్యాలు, ఉద్యోగాల కొరత, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే అవకాశాల లేమి వంటి సాధారణ అంశాల్లో ఇరు మతాల ప్రజలదీ ఒకే తీరుగా ఉంటోంది. ఇక యువత విషయానికి వస్తే అన్ని చిన్న పట్టణాలకు మల్లే అయోధ్యనుంచి పరారై ఏ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహా నగరాలకు తరలి వెళ్లడానికే చూస్తున్నారు. హిందువైనా, ముస్లిమైనా అయోధ్యలోని సగటు వ్యక్తి వ్యవస్థ పట్ల తీవ్రాతితీవ్రమైన నిస్పృహను కలిగి ఉంటున్నాడు. రాజకీయ నాయకుల పట్ల, కండబలంతో పట్టణంలో దాషీ్టకం చలాయిస్తున్న నకిలీ సాధువుల పట్ల సగటు మనిషిలో వ్యతిరేకత పెరుగుతోంది. సాధువుల ముసుగులో నేరస్తుల ఉపద్రవం కూడా నిరాకరించలేని వాస్తవంగా ఉంటోంది. ఈ దైవసమానులు వారి అనుయాయులూ లైంగికదాడికి ఇతర హింసాత్మక నేరచర్యలకు పాల్పడకుండా ప్రశాం తంగా గడిచిన నెలను అయోధ్య చూడటంలేదు. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువులు, సన్యాసుల రూపంలో నేరగాళ్లు రాజ్యమేలుతున్న అయోధ్యలో పవిత్రత అనేది నశించిపోతోంది. కానీ రామమందిర ఉద్యమం, దానిచుట్టూ నడుస్తున్న రాజకీయాలు ఏవీ అయోధ్యలో వారసత్వంగా వస్తున్న ధర్మపరాయణత్వం, భక్తి, శాంతిని ధ్వంసం చేయలేకపోయాయి. ముక్తిగాములై ఆశ్రయం పొందగోరి వచ్చిన, ఆధ్యాత్మికత తప్ప మరేమీ ఎరుగని ప్రజల నివాస ప్రాంతంనుంచి హిందూ ఓటు బ్యాంకును సృష్టించే రాజకీయ ఉద్యమానికి ప్రయోగ స్థలంగా అయోధ్య ప్రస్తుతం రూపాంతరం చెందింది. బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం మూడు దశాబ్దాల తర్వాత కూడా ఆలయ నిర్మాణం అనే ఒకేఒక్క అంశం అయోధ్యలో ప్రాబల్య స్థానంలో కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ వివాదానికి న్యాయపరమైన పరిష్కారం తుది అంచుల్లో ఉంటూండగా, మసీదును కూల్చివేసిన సందర్భంగా నమోదు చేసిన కేసులను కూడా ఫాస్ట్–ట్రాక్ ప్రాతిపదికన విచారించి తీర్పు చెప్పడం అవసరం. ముస్లింలలో తమకూ న్యాయం జరిగిందనే సంతోషాన్ని కల్పించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు మీదే ఉంది. అయోధ్య ఏనాడో కోల్పోయిన ధర్మనిష్టను పునరుద్ధరించే మార్గం ఇదొక్కటి మాత్రమే. శ్రీరాముడు ప్రతిపాదించిన, ఆచరించిన న్యాయం, శాంతికి సంబంధించిన విలువలకు నిజమైన నివాళి కూడా ఇదే మరి. ఎందుకంటే శ్రీరాముడి పేరుమీదనే కదా ఇంత చరిత్ర, ఇన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి! (ది వైర్‌తో ప్రత్యేక ఏర్పాటు) వ్యాసకర్త : వలయ్ సింగ్, జర్నలిస్టు, రచయిత -
రామ... రామ
సాధారణంగా నేను వివాదాల జోలికి పోను. అది నా ప్రమే యమూ, స్వభావమూ కాదు. కానీ మొన్న పొరుగు దేశంలోని ఓ దౌర్భాగ్యుడు– తినడానికి తిండి కూడా సరిగా లేని దేశంలో బోర విరు చుకు తిరుగుతున్న ఓ దౌర్జన్యకారుడు మసూద్ అజర్– అంటాడు కదా: ఇండియాలో రామ మందిరం నిర్మిస్తే దేశం మంటల్లో భగ్గుమం టుందని. అనడానికి ఎవడు వీడు? ఏమిటి వీడి గుండె ధైర్యం? ఈ మాటలకి కడుపు మండి ఈ నాలుగు మాటలూ. ఈ దేశం ముస్లిం సోదరులను శతాబ్దాలుగా అక్కున చేర్చుకుంది. రాజకీయ రంగంలో, కళారంగంలో, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలోనూ వారు మనకు ఆప్తులు. ఇటు వేంకటేశ్వరునికీ, అటు భద్రాద్రి రామునికీ ముస్లిం భక్తుల కథలు మనకు తెలుసు. మనకు ముగ్గురు రాష్ట్రపతులు ముస్లింలు. ఉపరాష్ట్రపతులు ముస్లింలు. ఈ హెచ్చరికకు రెచ్చి, ఈ దేశంలో ముస్లింలంతా ఏకమయి– ‘మీరు పక్కకు తప్పుకోండి బాబూ. మేం రామమందిరాన్ని నిర్మిస్తాం’ అని ముందుకు రారేం? షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ రామ మందిర నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదన్నారు. గవర్నమెంటు పూనుకోకపోతే నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణానికి పూనుకుంటా మన్నారు ఆరెస్సెస్ అధ్యక్షులు మోహన్ భగవత్‌గారు. పద్మభూషణ్ బాబా రామ్‌దేవ్– అయో ధ్యలో వివాదాస్పద స్థలానికి పక్కన ఉన్న చోట రామమందిరం నిర్మించడానికి ఏం పోయేకాలం? అని వాక్రుచ్చారు. అలనాడు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఆనుకుని మసీదు వెలిసినప్పుడు, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన గది గోడని ఆనుకుని మసీదు వెలసినప్పుడు హిందువులు గొంతులు ఎత్తలేదేం? సామరస్యం కారణమా? అలనాటి పాలకుల పట్ల భయమా? తాటస్థ్యమా? నిర్వేదమా? మరి ఇలాంటివేవీ గత 77 సంవత్సరాలుగా ముస్లిం సోదరులు చూపలేదేం? వారి ఓట్లకు రాజకీయ పార్టీల కక్కుర్తి కారణమా? విజయ్‌సింగ్ ఆలేఫ్ ఈ మధ్య రాసిన "Ayodhya: City of Faith, City of dis- cord'' అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ వచ్చిన వ్యాసంలో మొదటి వాక్యాలు ఉటంకిస్తాను: ‘రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని దుర్విని యోగం చేస్తే, ఏ దేశానికీ ఫలితాలు సామర స్యంగా ఉండవు. వ్యవస్థల మతపరమైన వివా దాలను న్యాయసమ్మతంగా, సామరస్యంతో, సత్వరంగా పరిష్కరించలేకపోవడానికీ ఇదే కారణం’. ఇంతకీ పాకిస్తాన్లో ‘వాగిన’ దౌర్జన్యకారుడికి– ఇద్దరు సీనియర్ ముస్లిం నాయకులు స్పందించి: ‘నువ్వు నోర్మూయవయ్యా. ఇది మా దేశం సమస్య. మేం చూసుకుంటాం’ అంటే ఎంత గంభీరంగా ఉంటుంది? అంత Objective nobility మన సోదర ముస్లిం నాయకులకి ఉందా? అవకాశవాదం అటకెక్కితే సంకల్ప బలానికి ‘చేవ’ కుదురుతుంది. ఇన్ని సంవత్సరాల అయోధ్య వివాదం హిందువుల నిస్సహాయతకు మాత్రమే నిదర్శనం కాదు. తమలో ఒకరుగా, తమలో వారుగా భావించే ముస్లిం సోదరుల ‘చిన్న’ మనసుకి కూడా నిదర్శనం. దేశంలో అక్కడక్కడా మత విధ్వంసాలు ఉంటాయి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలకు అవి అడ్డు పడకూడదు. పక్కవాడు ‘ఉసి’కొల్పడం అందుకు మన మౌనం మన మానసిక ‘సంకుచితతత్వాని’కి నిదర్శనమనిపిస్తుంది. పెద్దల మనస్సుల్లోనూ ఇంకా ‘చీకటి’ గదులున్నాయనిపిస్తుంది. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి మతం పెట్టుబడి. అందుకని మిగతా పార్టీలు వారి ఆలోచనలకు కలసిరావు. సరే. మరి రాముడు ఈ దేశానికే ఆరాధ్య దైవం కదా? అయినా రాజకీయ రంగంలో ఆయన పరపతి చెల్లదా? దీనికి పరిష్కారం– దమ్మున్న వ్యవస్థ. గుండెబలం ఉన్న నాయకత్వం. నిజానికి ఆనాటి మెజారిటీ హిందువులను విస్మరించి – కాశీ, మధుర దేవాలయాల పొరుగున మసీదుల నిర్మాణమే ఇందుకు తార్కాణం. ఇప్పుడు కేంద్రం సుప్రీం కోర్టుని ఆశ్రయిం చింది. ‘అయ్యా– అయోధ్యలో ‘వివాదం’ లేని 67.39 ఎకరాల స్థలాన్ని మాకు అప్పగించండి’– అని. కాంగ్రెస్ భయం అప్పగిస్తుందని కాదు. తీరా అప్పగిస్తే తమ ‘పరపతి’ మాటేమిటని. ‘ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో మర్మమేమిట’ని కాంగ్రెస్ కత్తి దూసింది. కాంగ్రెస్ భయం తీరా సుప్రీంకోర్టు తలూపుతూ ఉందేమోనని! ఇక్కడ తగాదా ‘రాముడు’ కాదు– ఓట్లు. ఇదీ మన దరిద్రం. ఇందుకే ఈ సమస్య ఇన్నాళ్లు మురిగింది. ఇంకా మురుగుతుంది. గొల్లపూడి మారుతీరావు -
మోదీ సుదీర్ఘ సంభాషణ
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గంటన్నరపాటు జరిగిన ఆ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు. గత పాలకులు ఏ పార్టీకి చెందినవారైనా, వారిలో కొందరు మీడియాతో సంఘర్షించిన సందర్భాలున్నా తరచూ పాత్రికేయులతో సంభాషించేవారు. విశాల ప్రజానీకానికి తమ భావాలు చేరాలంటే మీడియానే ఆధారమని విశ్వసించేవారు. కానీ మోదీ ఇందుకు భిన్నం. ఆయన కేవలం ఎంపిక చేసుకున్న చానెళ్లతో మాట్లాడతారు. ట్వీటర్ ద్వారా, ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో సంభాషిస్తారు. మీడియా సమావేశాల్లో నేతల ప్రసంగాలు పూర్తయిన వెంటనే విలేకరులు ప్రశ్నల బాణాలు సంధిస్తారు. వాటిలో ఎన్నో అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు ప్రజలకు మరింత లోతుగా ఆ నాయకుల ఆలోచనలు, మనోభావాలు అర్ధమవుతాయి. మోదీ బలమంతా ఆయన సంభాషణ చాతుర్యమే. పార్లమెంటులో జరిగే చర్చల్లో ఈ సంగతి తరచు తెలుస్తూనే ఉంటుంది. అయినా ఆయన విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ పలు ప్రశ్నలకు సుదీర్ఘంగా జవాబులిచ్చారు. ఇందులో రామమందిరం మొదలుకొని ఈమధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. పాకిస్తాన్‌తో సంబంధాలు, చైనాతో ఏర్పడ్డ వివాదం, మూకదాడులు, పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్, శబరిమల తదితర విషయాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి అడిగితే ‘నేను వినలేదు. నాకేమీ తెలియదు’ అని తేల్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి ఓటమిపాలైన సంగతిని ప్రస్తావించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామాపైనా పెదవి విప్పారు. రామమందిరం విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న ఊహాగానాలు నిజం కాదని ఆయన తేల్చిచెప్పడం బాగానే ఉంది. ఊహాగానాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉన్నకొద్దీ అవి మరింత చిక్కబడతాయి. అనవసర ఉద్రిక్తతలు ఏర్పడతాయి. కానీ ‘న్యాయ ప్రక్రియ ముగిశాక’ మా బాధ్యతను నిర్వర్తించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం వల్ల కొత్త సందేహాలొస్తాయి. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడినా దానికి కట్టుబడి ఉంటామని చెబితే వేరు. ఆ స్పష్టత లేకపోవడం వల్ల తమ ఆలోచనలకు భిన్నమైన తీర్పు వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్న సందేహం మిగిలే ఉంటుంది. ట్రిపుల్ తలాక్ అంశం వేరు. ఆ విధానం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక ప్రభుత్వం దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అనంతరం దాని స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ముందుంది. మరో ముఖ్యాంశం రైతు రుణ మాఫీ గురించి కూడా మోదీ తన మనోగతం చెప్పారు. రుణమాఫీ వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందేనని అంటూనే ఎన్నోసార్లు రుణ మాఫీ జరిగినా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమేమిటని కూడా ఆయన అడిగారు. దానికి భిన్నంగా భూసార పరీక్ష కార్డులు, 22 పంట దిగుబడులకు స్వామినాథన్ కమిషన్ సూచించినట్టు 50 శాతం అదనంగా ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని మోదీ వివరించారు. కానీ కేంద్ర విధానం తాను సూచించిన తరహాలోలేదని స్వయానా స్వామినాథనే ఆమధ్య చెప్పిన సంగతి ఆయనకు తెలిసినట్టు లేదు. సాగు పెట్టుబడిని కేవలం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులకయ్యే ఖర్చుకే పరిమితం చేయకుండా పొలంలో పనిచేసేవారి వార్షిక వేతనాలు, కౌలు మొత్తం, బీమా వ్యయం వగైరాలను కూడా లెక్కేసి దానికి అదనంగా ఒకటిన్నర రెట్లు ఇవ్వాలన్నది స్వామినాథన్ సూచించిన విధానం. దాన్ని తు చ తప్పకుండా అమలు చేస్తే రైతుల సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. అప్పుడు మోదీ చెప్పినట్టు రుణమాఫీ అవసరమే రాకపోవచ్చు. మరో సంగతేమంటే...యూపీ ఎన్నికల సమయంలో బీజేపీయే రుణమాఫీ వాగ్దానాన్ని చేసింది. అందువల్ల ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్లతో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతుల్లో ఎక్కువమంది బ్యాంకుల దగ్గర కాకుండా ప్రైవేటు రుణాలే తీసుకుంటారన్న మాట కూడా నిజం. తక్కువ వడ్డీకి రుణం దొరికే బ్యాంకుల దగ్గరకు పోకుండా అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు రుణాలకు రైతులు ఎందుకు వెళ్తున్నారో గ్రహించి ఆ లోటుపాట్లను కేంద్ర ప్రభుత్వం ఈపాటికే సరిచేసి ఉంటే బాగుండేది. కనీసం ఆ విషయంలో ఏం చేయబోతున్నారో కూడా మోదీ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలు చిక్కినప్పుడల్లా తనపై విరుచుకు పడుతున్నా ఇంటర్వ్యూలో ఆయన గురించి మోదీ అసలు ప్రస్తావించనే లేదు. తెలంగాణలో మహా కూటమి చిత్తుగా ఓడిపోవడం గురించి మాత్రమే మాట్లాడి దానికి సూత్రధారిని మాత్రం ఏమీ అనలేదు. ఆ రెండు పార్టీల ఉన్న బంధం చిత్రమైనది. బాబు చెప్పుకుంటున్నట్టు నిజంగా ఆయన మోదీపై హోరాహోరీగా తలపడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలపై ఈపాటికే అనర్హత వేటు పడి ఉండాలి. చట్టసభల అధ్యక్షులే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవా లని నిబంధనలు చెబుతాయి. కానీ అంతిమంగా అది రాజకీయ నిర్ణయం. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి అనేకసార్లు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. మరో ఆర్నెల్లలో ఈ సభ గడువు కూడా ముగిసిపోతోంది. చట్టప్రకారం యధావిధిగా జరగాల్సిన అంశంలోనే ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తుంటే ఇక వారిద్దరూ ప్రత్యర్థులంటే నమ్మేదెవరు? ఇప్పుడు మోదీ తన జవాబుల్లో బాబు పేరెత్తకపోవడం కూడా దాన్నే ధ్రువపరు స్తోంది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో సుదీర్ఘ సంభాషణే సాగినా, కీలక అంశాలే ప్రస్తావనకొచ్చినా అసంపూర్ణంగానే అనిపిస్తుంది. కేవలం ఒక్కరితోనే సంభాషించినప్పుడు ఇది తప్పదు. -
‘రామమందిర నిర్మాణం.. యావత్ దేశం కోరుకుంటోంది’
సాక్షి, ముంబై: భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని రాజకీయ లబ్దికోసం వాడుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణం కేవలం బీజేపీ మాత్రమే కోరుకోవటం లేదని.. యావత్ దేశం కావాలనుకుంటోందని స్పష్టం చేశారు. బుధవారం ఓ జాతీయ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై చర్చించారు. అక్టోబర్‌లో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేవలం మూడే మూడు నిమిషాలు వాదనలు విని జనవరి 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని, వరుసగా పది రోజులూ ఈ కేసులో సుప్రీంకోర్టు వాదనలు వింటే.. వెంటనే స్పష్టమైన తీర్పు ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అలహాబాద్ హైకోర్ట్ అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని లేకుంటే రామమందిర నిర్మాణం అప్పుడో జరిగేదని గుర్తుచేశారు. బీజేపీ అయోద్యలో రామమందిర నిర్మాణం జరగాలని బలంగా కోరుకుంటుందన్నారు. వచ్చే జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం లింగవివక్ష కాదనీ, అది విశ్వాసాలకు సంబంధించిన అంశమని వివరించారు. ఇక సంఘ్ పరివార్‌తో కొందరు బీజేపీ నేతలు కలిసి రామమందిర నిర్మాణం చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా రామమందిర నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీలైనంత తొందరగా ఈ అంశంపై ఓ నిర్ణయానికి రావాలని కేంద్రం కూడా భావిస్తోంది. జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
మోదీ సర్కార్‌ను కూలదోస్తా: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు అభ్యతరం లేదనీ, అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్, యూపిలోని యోగి సర్కార్ ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని అన్నారు. ఏదేని కారణాలతో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని హెచ్చరించారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే జనవరి తర్వాత అయోధ్య కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
'దేశ వ్యాప్తంగా రామమందిరాలు నిర్మిస్తాం'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంపట్ల అసంతృప్తితో ఉన్న వీహెచ్‌పీ దేశ వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో రామమందిరాన్ని నిర్మించాలని తాము నిర్ణయించినట్లు వీహెచ్ పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. రామ మహోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 15న శ్రీరామ నవమితో ప్రారంభిస్తామని ఏడు రోజులపాటు ఈ ఉత్సవం కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో హిందువులు శ్రీరాముడిని కొలుస్తారని చెప్పారు. ఇలా చేసే గ్రామాల సంఖ్య 1.25లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గతంలో దాదాపు య75 వేల గ్రామాల్లో రామనవమి మహోత్సవాలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చి ప్రాదాన్యం సంతరించుకుంది.