న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభల్లో ఈ పదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు.
2019 ఎన్నికల ముందు కూడా ప్రధాని ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా ఈ నెలలో 15 రోజులు ఈ పనిమీదే ప్రధాని దృష్టిపెట్టనున్నారు. ఈ వారంతంలో ప్రధాని ఒడిషా,అస్సాంలలో పర్యటించనున్నారు.
అయితే అందరూ అనుకుంటున్నట్లు కాకుండా ప్రధాని తన ప్రసంగాల్లో అయోధ్యలో ఇటీవల జరిగిన రామమందిర ప్రారంభోత్సవ అంశం కంటే ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాజాగా పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రసంగం తర్వాత ఆయన గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా అయోధ్య ప్రస్తావన తీసుకురాలేదు. దీన్ని బట్టి ఆయన ఇక ముందు కూడా తన ప్రసంగాల్లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతున్నారు. అయితే అయోధ్య రామమందిర అంశాన్ని కూడా అవసరమైనపుడు తప్పకుండా ప్రచారంలో వాడుతారని మరో వాదన కూడా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment