పుదుచ్చెరి: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా చెప్పారు. పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పుదుచ్చేరిలో తన అధికారిక నివాసం(రాజ్ నివాస్)లో మీడియాతో ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పుదుచ్చేరి నుంచి ఎంపీగా బరిలో దిగుతారనే ఊహాగానాల నడుమ అదే అంశాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం.
‘‘నేనొక సాధారణ వ్యక్తిని. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి ఏం ఆదేశిస్తారో అది మాత్రమే నేను ఒక సాధారణ కార్యకర్తలా చేస్తా. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చెరి నుంచి పోటీచేయబోతున్నానని నేను ఎక్కడా అనలేదు. నా జీవితంలో ఇది కావాలని ఏనాడూ అడగలేదు. అగ్రనాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.
ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. అయితే అది నెరవేరుతుందా లేదా అనేది ప్రధాని మోదీ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’అని ఆమె అన్నారు. ‘‘కోవిడ్ విపత్తుకాలంలో పుదుచ్చెరిలో కరోనా వ్యాక్సిన్లు సకాలంలో అందించడంలో సఫలమయ్యా. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడితో పుదుచ్చేరిని అందరికీ ఆదర్శంగా నిలిపా. అరబిందో, సుబ్రమణ్యభారతి వంటి వారికి పుదుచ్చేరితో ఎంతో అనుబంధం ఉంది.
నాకూ అలాంటి అనుబంధమే ఉంది. కానీ ఇన్నేళ్లు ఇక్కడ ఉన్నా కొందరు ఇంకా నన్ను ‘బయటివ్యక్తి’అనడం నాకెంతో బాధగా ఉంటుంది’’అని అన్నారు. ‘‘మూడేళ్లకాలంలో పుదుచ్చేరిలో వేర్వేరు రంగాల్లో, ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశా. ఇక్కడి ఎన్నుకున్న ప్రభుత్వ సహాయసహకారాలతో ఉత్తమంగా పాలించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment