
వక్ఫ్ బిల్లుకు త్వరలో ఆమోదం
మోదీ 3.0 వంద రోజుల పాలన విజయాలపై మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు.
జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం
జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు
‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.
25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు.