సాక్షి, ముంబై: భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని రాజకీయ లబ్దికోసం వాడుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణం కేవలం బీజేపీ మాత్రమే కోరుకోవటం లేదని.. యావత్ దేశం కావాలనుకుంటోందని స్పష్టం చేశారు. బుధవారం ఓ జాతీయ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై చర్చించారు. అక్టోబర్‌లో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేవలం మూడే మూడు నిమిషాలు వాదనలు విని జనవరి 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని, వరుసగా పది రోజులూ ఈ కేసులో సుప్రీంకోర్టు వాదనలు వింటే.. వెంటనే స్పష్టమైన తీర్పు ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో అలహాబాద్ హైకోర్ట్ అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని లేకుంటే రామమందిర నిర్మాణం అప్పుడో జరిగేదని గుర్తుచేశారు. బీజేపీ అయోద్యలో రామమందిర నిర్మాణం జరగాలని బలంగా కోరుకుంటుందన్నారు. వచ్చే జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం లింగవివక్ష కాదనీ, అది విశ్వాసాలకు సంబంధించిన అంశమని వివరించారు.
ఇక సంఘ్ పరివార్‌తో కొందరు బీజేపీ నేతలు కలిసి రామమందిర నిర్మాణం చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా రామమందిర నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీలైనంత తొందరగా ఈ అంశంపై ఓ నిర్ణయానికి రావాలని కేంద్రం కూడా భావిస్తోంది. జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment