న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ను ప్రత్యేక ట్రీట్‌మెంట్‌గా అమిత్ షా అభివర్ణించారు.
ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఆప్ అధినేతకు లభించిన బెయిల్ సాధారణ తీర్పు కాదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ప్రత్యేక సౌలభ్యం కల్పించినట్లు దేశంలో చాలామంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై అమిత్ షా మండిపడ్డారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందని అన్నారు. ‘ఎన్నికల్లో విజయం సాధిస్తే.. కేసుల్లో దోషులుగా తేలిన వారిని కోర్టు జైలుకు పంపదని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. బెయిల్ తీర్పును ఎలా ఉపయోగించుకుంటున్నారో లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి’ అని షా పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీహార్ జైల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి తన కదలికలను పర్యవేక్షిస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. ‘తిహార్ జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉంది. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఎలాంటి సంబంధం లేదు. కేజ్రీవాల్ కావాలనే అబద్ధాలు చెబుతున్నారు.
బెయిల్ మార్గదర్శకాల ప్రకారం, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సెక్రటేరియట్‌ను కూడా సందర్శించలేరు. కేసు గురించి వ్యాఖ్యానించవద్దని లేదా సాక్షులెవరితోనూ సంభాషించవద్దని కూడా కోర్టు తెలిపింది. జూన్ 2లోగా జైలు అధికారులకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది. మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందే.’ అని మండిపడ్డారు.
కాగా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఆప్ పార్టీ అధినేతగా ఉన్న ఆయన..లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment