
జైపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కొంతమంది వ్యక్తులకు అప్పజెప్పామని పేర్కొన్నారు. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ రాముని కోసం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఇది మా బాధ్యత. మాకు మేము స్వతహాగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యతను కొంతమంది వ్యక్తులకు అప్పగించాం. అయినప్పటికీ వారిపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసీ హెచ్చరికలను సైతం లెక్కచేయక.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా రామ మందిరం, ట్రిపుల్ తలాక్ పేరిట ఓట్లు అడిగిన విషయం విదితమే. ఇక రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆగస్ట్ 15న సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. కోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ కమిటీ నుంచి ఇప్పటివరకూ మే 7న మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించిందని, పూర్తి నివేదిక కోసం మరికొంత సమయం అవసరమని కోరిందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఈ వివాదంపై విచారణ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment