పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు.
ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు.
జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం.
బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం.
భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం.
ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం.
ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్‌సేవక్‌లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం.
అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు.
మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో!
మందలింపు మాటలు
Published Thu, Jun 13 2024 12:30 AM | Last Updated on Thu, Jun 13 2024 12:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment