సాక్షి,హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై సంఘ్ పరివార్(ఆర్‌ఎస్‌ఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంఘ్ పరివార్ నేతలకు వివరించారు.
ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు బీజేపీ నాయకులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఈసారి పదికిపైగా స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ నేతలు చెప్పారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల మధ్య విభేదాలపై పరివార్ నేతలు గట్టిగానే అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని మొట్టికాయలు వేశారు.
ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారు. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు.
ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment