ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.
రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్‌సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్‌లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది.
ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది.
అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్‌దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది.
అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది.
రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం.
మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్‌లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత.
కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్‌లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి.
జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు.
చిత్తశుద్ధి కావాలి!
Published Thu, Jun 20 2024 12:29 AM | Last Updated on Thu, Jun 20 2024 12:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment