'ఆర్ఎస్ఎస్ లేనిదే మోడీ, అమిత్ షా సున్నా'
బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే.. వాళ్లిద్దరికీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగ్వత్ పెద్ద షాక్ ఇచ్చారు. లక్షలాది మంది సభ్యులు, ప్రచారకులతో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన ఆర్ఎస్ఎస్ను అసలు పట్టించుకోకుండా ఇలా పరస్పరం పొగుడుకోవడం ఏంటని ఆయనకు మండినట్లుంది. ఏ ఒకకరిద్దరు నాయకుల వల్లనో బీజేపీ విజయం సాధించలేదని మోహన్ భాగ్వత్ అన్నారు. ఎవరి పేర్లూ పైకి ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ప్రధాన నాయకులిద్దరినీ ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
''కొంతమంది పార్టీకి క్రెడిట్ ఇస్తుంటే, మరికొంతమంది కొందరు వ్యక్తులకే ఈ క్రెడిట్ ఇస్తున్నారు. కానీ ఈ వ్యవస్థ, పార్టీ, వ్యక్తులు ఇంతకుముందు కూడా ఉన్నారు. అప్పుడేం జరిగింది? ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్లే అధికారంలోకి తెచ్చారు. వాళ్లు సంతోషంగా లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేస్తారు'' అని ఆయన అన్నారు.
ఎఫ్డీఐల లాంటి అంశాల్లో ఆర్ఎస్ఎస్ ప్రాథమిక సిద్ధాంతాలను కూడా మర్చిపోయినట్లుగా బీజేపీ సర్కారు ప్రవర్తిస్తోందని ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ వర్గాలు మండిపడ్డాయి. ఆర్ఎస్ఎస్ లేనిదే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ సున్నాలలాంటివాళ్లేనని కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోడీ సర్కారు పనిచేస్తోందని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విమర్శలు వినిపించాయి.