విస్తరణ: ఆరెస్సెస్ అసంతృప్తి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బృందావన్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ కీలక సమావేశానికి బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఇతర సంఘ్ ముఖ్యనేతలతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వం రూపొందించిన జాబితాపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ కొందరు మంత్రులను తొలగించాలని మోదీ తీసుకున్న నిర్ణయంపై సంఘ్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధమున్న బండారు దత్తాత్రేయ.. తనను తొలగించటంపై ఆరెస్సెస్ అధిష్టానానికి ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఉమాభారతి కూడా తనను రాజీనామా చేయమని కోరటంపై ఆరెస్సెస్‌కు ఫిర్యాదు చేశారని.. వెంటనే జోక్యం చేసుకోమని కోరారని చర్చ జరుగుతోంది. నిర్మలా సీతారామన్‌ను ప్రమోట్ చేయటంపైనా సంఘ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కూడా ఈ విస్తరణపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాజీనామా చేసిన మంత్రుల్లో అధికులు తనకు దగ్గరివారయి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
శివసేన అసంతృప్తి
అటు ఎన్డీయే భాగస్వామి శివసేన కూడా మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తితో ఉంది. ‘కేబినెట్ విస్తరణ వార్త మీడియా ద్వారానే మాకు తెలిసింది. బీజేపీ నాయకత్వం దీనిపై నన్నేమీ అడగలేదు. అయినా అధికారంపై మాలో ఆతృత లేదు’ అని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.