మోదీని ఇరకాటంలో పడేసిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమితా షానే మరో పర్యాయం ఎన్నిక కావాలని కోరుకుంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆరెస్సెస్ బాసులు ఇరకాటంలో పడేశారు. జనవరి 23వ తేదీన పదవీకాలం ముగిసిపోతున్న అమితా షాను మరోసారి పార్టీ అధ్యక్షుడిని చేయాలంటే తాము సూచించిన ఇద్దరు బీజేపీ నాయకులను పార్టీ ఉన్నత పదవుల్లోకి తీసుకోవాలని, లేదంటే అమిత్ షా స్థానంలో వీరిలో ఒకరిని తీసుకోవాలని షరతు విధించినట్లు ఆరెస్సెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఆరెస్సెస్ నలుగురు ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన కృష్ణ గోపాల్ ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వేర్వేరుగా కలసుకొని ఈ షరతుల గురించి 90 నిమిషాలపాటు చర్చించారు. ఆరెస్సెస్ సూచిస్తున్న ఆ ఇద్దరు బీజేపీ నాయకులు ఎవరో, వారికి, మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయా, లేవా? అన్న విషయాలను ఆరెస్సెస్ నాయకత్వ వర్గాలు వెల్లడించడం లేదు. బీజేపీపై పట్టును కోరుకుంటున్న ఆరెస్సెస్ నాయకత్వానికి మాత్రం వారు సన్నిహితులనే విషయం అర్థమవుతోంది. కృష్ణ గోపాల్ జరిపిన చర్చల్లో కూడా అమిత్ షానే మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నానని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అమిత్ షా రెండోసారి ఎన్నికపై మోదీ, ఆరెస్సెస్ నాయకత్వం పట్ల గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాలను పరిష్కరించడం గురించి ఈనెల 8వ తేదీన ముంబైలో ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ అధిష్టాన సమావేశంలో విఫులంగా చర్చించారు. అక్కడే ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదన పుట్టుకొచ్చిందని ఆరెస్సెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మోదీయేనని ఆ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి బీజేపీ అధ్యక్ష పదవి మూడేళ్లు ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా 2013లో రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ స్థానంలో తాత్కాలిక ఏర్పాటు కింద 2014 జూలైలో అమిత్ షా ఎన్నికయ్యారు.