బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశమయ్యారు.
నాగ్‌పూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశమయ్యారు. శనివారం నాగ్‌పూర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో భాగవత్, ఇతర ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలతో సుమారు గంటన్నర పాటు అమిత్‌షా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విజయాలు, సంస్థాగతమైన అంశాలు, ప్రతిపక్షాల ఎదురుదాడి తదితర విషయాలపై వీరు చర్చలు జరిపినట్టు తెలిసింది.
గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. మోహన్ భాగవత్‌తో భేటీ కాగా తాజాగా అమిత్‌షా ఆయనతో సమావేశం కావడం గమనార్హం. అయితే ఈ రెండు సమావేశాలకు సంబంధించి బీజేపీగానీ, ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ సందర్భంగా రేషిమ్‌బాగ్‌లోని స్మృతి మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. నాగపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్‌గడ్కారీతోనూ అమిత్‌షా భేటీ అయ్యారు.