అసలైన ధర్మానికి అర్థం మార్చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ అన్నారు. మనిషిలో స్వార్థం పెరిగి.. ధర్మానికి, అధర్మానికి అర్థంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు. మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు.
సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దాన్ని వదిలేసి వస్తు రూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు. భారత్ సనాతన దేశం. రుషులు, మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం. ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు, ధర్మాలు రాశారు. అలాంటి వాటిని అనుసంచాల్సిన మనం.. కేవలం అనుకూలమైనవాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతున్నాం.
ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు. మనమంతా సంస్కృతి, ధర్మంవైపు అడుగులు వేయాలి. కానీ వికృతి దిశగా వెళ్తూ సృష్టి ధర్మాన్ని విస్మరిస్తున్నాం. విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు. విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది.
సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన ఉత్సవాలు
లోక్‌మంథన్ భాగ్యగనర్–24 ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనే ఆవశ్యకతను వక్తలు వివరించారు. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా 210 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో మూడు వేదికల్లో 12 దేశాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖులు ఉపన్యాసాలు, బోధనలు అందించారు.
సుమారు 1,500 మంది కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. లోక్ మంథన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఆహార ధాన్యాలు, ఔషధ మొక్కల స్టాల్స్, గిన్నిస్ రికార్డు అందుకున్న భారీ పెన్ను వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు ఉత్సవాల్లో అభినయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహాన్ భారతోహం పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు 2.10 లక్షల మందికిపైగా లోక్ మంథన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment